షర్మిల చేయగలిగితే కేసీఆర్‌ చేయలేరా?

April 19, 2021


img

వైఎస్ షర్మిల నిన్న లోటస్ పాండ్ నివాసంలో మూడు రోజుల ‘ఉద్యోగ దీక్ష’ను ముగిస్తూ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. “ఆత్మహత్యలు చేసుకోవాలనుకొనే నిరుద్యోగులు అటువంటి ఆలోచనలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కేసీఆర్‌ ఉద్యోగాలు ఇచ్చేవరకు పోరాడుదాం. ఒకవేళ ఇవ్వకపోతే రెండేళ్ళ తరువాత మన పార్టీయే అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఉద్యోగాలన్నీ భర్తీ చేసుకొందాం. ప్రైవేట్ రంగంలో కూడా లక్షల ఉద్యోగాలు సృష్టించుకొందాం. అంతవరకు అందరూ ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

వైఎస్ షర్మిల తానైతే అనేక ఉద్యోగాలు కల్పించగలనని చెపుతున్నారు. ఒకవేళ ఆమె ప్రభుత్వంలో... ప్రైవేట్ రంగంలో లక్షల ఉద్యోగాలు భర్తీ చేయగలిగితే సిఎం కేసీఆర్‌ ఆ పని చేయలేరా? కానీ ఎందుకు చేయడం లేదు?అంటే...   ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించే పరిశ్రమ కాదు...వాణిజ్య సంస్థ అసలే కాదు. పరిశ్రమలు, ప్రైవేట్ సంస్థలైనా వాటి అవసరాలకు సరిపడినంతమందిని మాత్రమే భర్తీ చేసుకొంటాయి తప్ప బయట నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని అవసరానికి మించి భర్తీ చేసుకోవు. ఇక ప్రభుత్వం ఎందుకు చేసుకొంటుంది?అని ఆలోచిస్తే వైఎస్ షర్మిల వాదనలు ఎంత అర్ధరహితమో అర్ధమవుతుంది. 

అయినా రాష్ట్ర ప్రభుత్వం గత ఆరున్నరేళ్ళలో 1.30 లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేసిందని రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ప్రైవేట్ రంగంలో కూడా లక్షలాది ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. త్వరలోనే మరో 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. 

గత ఆరున్నరేళ్ళు హైదరాబాద్‌ నగరానికి అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తరలివచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలలో కూడా ఐటీ-హబ్‌లు, టెక్స్‌టైల్‌, ఇండస్ట్రియల్, ఫార్మా, మెడికల్ డివైజస్ పార్కులు ఏర్పాటు చేస్తోంది. వాటి ద్వారా రాష్ట్రంలో లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి లభిస్తున్నాయి. గత ఆరున్నరేళ్ళలో రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని చాలా అభివృద్ధి చేసింది. ఇవి కాక రాష్ట్ర ప్రభుత్వం చేపలు, మేకలు, గొర్రెలు, బర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. కులవృత్తులకు అనేక ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ఇంకా రాష్ట్రంలో అనేకానేక పధకాలు అమలుచేస్తోంది. ఇవన్నీ ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్నవే. 

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి కల్పన కోసం ఇంతగా కృషి చేస్తుంటే, వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించడం, కనీసం వార్డు మెంబరుగా చేసిన అనుభవమే లేని ఆమె సిఎం కేసీఆర్‌ కంటే గొప్పగా పరిపాలనచేయగలనని చెప్పుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే తనను ముఖ్యమంత్రిని చేయమని అడగడం చూస్తే నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తానన్నట్లుంది.


Related Post