దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే, ప్రతీరోజూ లక్షలమంది దాని బారిన పడుతున్నారు. వందలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో హరిద్వార్‌లో 13 లక్షలమందికి పైగా సాధువులు, భక్తులు కలిసి కుంభమేళాలో పాల్గొంటున్నారు.
ఈ కుంభమేళా ముగిసిన తరువాత ఉత్తరాఖండ్ రాష్ట్రంతో సహా అక్కడికి వెళ్ళివచ్చిన వారిద్వారా దేశంలో కరోనా మహావిస్పోటనం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. కానీ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కుంభమేళాను రద్దు చేయలేదు కనీసం అక్కడికి వచ్చేవారి చేత కరోనా జాగ్రత్తలు పాటించేలా చేయలేక చేతులు ముడుచుకొని చూస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీపై సింహంలా గర్జించిన ప్రధాని నరేంద్రమోడీ చేతులు జోడించి కుంభమేళాను ముగించాలని వేడుకొంటున్నారు. కానీ కుంభమేళా యదాతధంగా సాగిపోతూనే ఉంది...రోజూ లక్షలమంది హరిద్వార్‌లో ఊరేగింపులు, సామూహిక స్నానాలు చేస్తూనే ఉన్నారు.
గత ఏడాది ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్ సమావేశానికి హాజరైనవారి ద్వారా తెలంగాణతో సహా దేశంలో పలు రాష్ట్రాలకు కరోనా విస్తరించినప్పుడు చాలామంది నేతలు, మీడియా ప్రతినిధులు గొంతు చించుచుకొని మాట్లాడారు. కేంద్రప్రభుత్వం మరో అడుగు ముందుకువేసి ఆ సమావేశం నిర్వహించినవారిపై కేసులు నమోదు చేయించి, దానికి హాజరైన విదేశీయుల పేర్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. దేశంలో కరోనా వ్యాప్తికి తబ్లీగీ జమాత్‌కు వెళ్ళినవచ్చినవారే కారణమంటూ వారిని దేశద్రోహుల్లా చూశారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.
కానీ ఆనాడు ప్రశ్నించిన గొంతులు ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు! రాంగోపాల్ వర్మ వంటి ఒకరిద్దరు తప్ప కుంభమేళా వలన కరోనా విస్పోటనం జరుగుతుందని చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. ఎందుకు? అంటే హిందూ ఓటు బ్యాంక్ దూరం చేసుకోవడం ఇష్టం లేకనే అనుకోవాలేమో? దేశానికి మార్గదర్శనం చేయవలసినవారు ఓటు బ్యాంక్ లెక్కలు కట్టుకొంటూ కూర్చోంటే రేపు జరుగబోయే అనర్ధానికి సామాన్య ప్రజలే ముందుగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. పెద్దనోట్ల రద్దు, లాక్‌డౌన్‌ల వలన నష్టపోయింది వాళ్ళే కదా? కనుక రేపు దీనికీ సామాన్య ప్రజలే మూల్యం చెల్లించవలసి రావచ్చు.