జియో విధ్వంసంపై ఎయిర్‌టెల్ అధినేత స్పందన

April 17, 2021


img

కొత్తనీరు వస్తే పాతనీరు బయటకు పోవలసిందే. ఇది అన్ని రంగాలకు వర్తిస్తుంది. కంప్యూటర్లు వస్తే టైప్ రైటర్స్ పోయాయి. ప్రైవేట్ ఛానల్స్ వచ్చాక దూరదర్శన్ పనైపోయింది. జియో వచ్చేక మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు మూతపడ్డాయి. జియో అంటే ‘జీవించు’ అని అర్ధం. కాని ‘జియో’ దేనినీ జీవించనివ్వకుండా చేసి తను ఒకటే జీవిస్తోందని చెప్పక తప్పదు. 2016లో జియో వస్తూనే అనూహ్యమైన వ్యాపారవిధానాలతో దిగి దూసుకుపోయింది. వ్యాపారంలో నేర్పు, దూకుడు ఉండటం అవసరమే. కానీ దాంతో బరిలో మరెవరూ మిగలకుండా విధ్వంసం చేయడాన్ని ఎవరూ సమర్ధించలేరు. జియో దెబ్బకు దేశంలోని ముఖేష్ అంబానీ తమ్ముడు అనీల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌ కంపెనీతో సహా తొమ్మిది కంపెనీలు దివాళా తీసి మూతపడగా మిగిలిన ఎయిర్‌టెల్, వోడాఫోన్‌ కంపెనీలు ప్రస్తుతం ఎదురీదుతున్నాయి. తొమ్మిది కంపెనీలు అంటే వాటిలో ప్రత్యక్షంగా పనిచేసే వేలాదిమంది ఉద్యోగులు, దేశవ్యాప్తంగా పరోక్షంగా వాటిపైనే ఆధారపడిన వేలాదిమంది ఎన్నో ఉంటాయి. వారందరూ కూడా జియో దెబ్బకు రోడ్డున పడ్డారు.   

ఎయిర్‌టెల్ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌ జియో చేసిన ఈ విధ్వంసంపై స్పందిస్తూ, “భారత్‌ వ్యాపారాలకు ఒక గొప్ప వేదిక. ఏ ఉత్పత్తి, ఏ సేవలకైనా కోట్లాదిమంది వినియోగదారులున్న అతిపెద్ద మార్కెట్‌ భారత్‌. అందుకే అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత్‌కు తరలివస్తున్నాయి. కానీ ఇంత సువిశాలమైన టెలికాం మార్కెట్‌లో ఒక్క కంపెనీ వలన అన్ని మూతపడటం, మిగిలినవి తమ మనుగడను కాపాడుకోవడం కోసం మాతో విలీనం కావలసి రావడం చాలా బాధాకరం. చివరికి మూడు కంపెనీలే బరిలో మిగలడం మళ్ళీ వాటిలో ఒకటి (జియో) మాత్రమే అనూహ్యంగా ఎదుగుతుండటం ఆలోచించవలసిన విషయమే. అయితే ఇటువంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న మేము ఈ సవాలును కూడా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాము. రాబోయే 5-10 ఏళ్ళలో భారత్‌ ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తుందని భావిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post