అలనాడు ముసలం పుట్టి యదుకులం నాశనమైంది. ఇప్పుడు ప్రపంచంలో కరోనా అనే ముసలం పుట్టి నాశనం చేస్తోంది. కరోనా మహమ్మారికి జన్మనిచ్చి ప్రపంచంపైకి వదిలేసిన చైనా దాని నుంచి బయటపడగలిగింది కానీ ఏడాదిన్నరగా భారత్‌తో సహా ప్రపంచదేశాలన్నీ దానితో ముప్పతిప్పలు పడుతూనే ఉన్నాయి.
చైనా ఏమి చేసినా అద్భుతంగానే ఉంటుంది. అలాగే కరోనా కూడా. నేటికీ శాస్త్రవేత్తలు దాని గురించి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు కొత్త రూపాలతో సాక్షాత్కరిస్తోంది...కొత్త లక్షణాలను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సవాలక్ష లక్షణాలను ప్రదర్శిస్తున్న కరోనా మహమ్మారి జాబితాలో తాజాగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు కూడా చేరాయి. విజయవాడలో ఈ లక్షణాలతో ఉన్న వ్యక్తికి పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఒకప్పుడు జలుబు, దగ్గు, జ్వరం వంటివాటిని ఎవరూ పెద్దగా పట్టించుకొనేవారు కారు కానీ ఇప్పుడు తలనొప్పి వచ్చినా కరోనా సోకిందేమో అని భయపడే దుస్థితి దాపురించింది. అలాగని... ఎవరూ ధైర్యంగా కరోనా పరీక్ష చేయించులేకపోతున్నారు. ఎందుకంటే కరోనా సోకితే ఆసుపత్రి ఖర్చులకు ఉన్నందంతా ఊడ్చుకుపోతుందనే భయం. ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకొంటే ఏమైనా అవుతుందేమోననే భయం. కరోనా సోకిందని తెలిస్తే ఇరుగుపొరుగులు వెలివేసినట్లు చూస్తారనే భయం.
చైనా సృష్టించిన ఈ కరోనా మహమ్మారి తీరు చూస్తే నభూతో... నభవిష్యత్ అన్నట్లుంది. కరోనా మహమ్మారి ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాక, మనుషుల, సంస్థల, ప్రభుత్వాల ఆర్ధిక పరిస్థితులను తారుమారు చేస్తోంది. సామాజిక సమస్యలు సృష్టిస్తోంది. అన్నీ మూతపడేలా చేసి కోట్లాదిమందిని రోడ్డున పడేస్తోంది. అణుబాంబు పడిన తరువాత ఏర్పడే విధ్వంసంలా ఉంది.
ప్రభుత్వాలు, ప్రజలు అష్టకష్టాలకోర్చి అతికష్టం మీద కరోనా మహమ్మారి కట్టడి చేస్తే రావణాసురుడి తలల్లా మళ్ళీ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంది. ఇంత విలక్షణమైన గొప్ప జబ్బును సృష్టించి ప్రపంచానికి అంటగట్టిన చైనా మాత్రం అన్ని రంగాలలో అభివృద్ధిపదంలో సాగిపోతుండటం విశేషం. బహుశః అందుకే ఈ జబ్బును సృష్టించి ప్రపంచానికి అంటగట్టిందేమో?
ఇకనైనా మమ్మల్ని కరుణించి విడిచిపెట్టవమ్మా కరోనా మహమ్మారి...అంటూ ప్రజలు పాటలు కట్టి ప్రార్ధిస్తున్నా కనికరం చూపడం లేదు. ఏలిననాటి శని ఏడేళ్ళు పట్టి పీడిస్తుందంటారు కానీ ఈ కరోనా మహమ్మారి ఇంకా ఎన్నేళ్ళు పీడిస్తుందో తెలీని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక మొసళ్ళ చెరువులో మొసళ్ళను తప్పించుకొని చేపలు బ్రతుకుతున్నట్లు మనం కూడా మన నీడలా వెంటాడుతున్న ఈ కరోనా మహమ్మారిని తప్పించుకొంటూ జాగ్రత్తగా బ్రతికేయాల్సిందే.