నేడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేనివిధంగా ఈ ఉపఎన్నికలు టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మూడు పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారడం విశేషం.
టిఆర్ఎస్: దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు తిన్నందున ఈ ఉపఎన్నికలలో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది టిఆర్ఎస్ సీటు కనుక దీనిని దక్కించుకోవడం కూడా చాలా అవసరమే లేకుంటే రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ఎదురుగాలి మొదలైందనే కాంగ్రెస్, బిజెపిల వాదనలకు బలం చేకూరుతుంది. పైగా ఈసారి అవతలి పక్క సీనియర్ కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి బరిలో ఉన్నారు. కనుక టిఆర్ఎస్‌కు ఈ ఉపఎన్నికలు అగ్నిపరీక్షవంటివే.
కాంగ్రెస్: తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి, ఏపీ కాంగ్రెస్‌ను బలిచేసుకొంటే, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా బలహీనపడి కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఫిరాయింపులతో టిఆర్ఎస్ దెబ్బ తీస్తే, రాష్ట్రంలో బిజెపి దూకుడు పెరగడంతో ఎన్నికలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతోంది. వరుస ఓటములతో ఢీలాపడిన కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ నూతనోత్సాహం నింపేందుకు చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ కురువృద్ధుడు కె.జానారెడ్డి తన పేరు ప్రతిష్టలను పణంగాపెట్టి స్వయంగా ఈ ఉపఎన్నికల కురుక్షేత్రంలో దిగారు. ఒకవేళ ఓడిపోతే ఆయన పరువు, కాంగ్రెస్ పరువు పోతుంది. కనుక ఈ ఉపఎన్నికలు ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి కూడా అగ్నిపరీక్షవంటివే.
బిజెపి: దుబ్బాక, గ్రేటర్ గెలుపు గాలివాటం కావని, తెలంగాణలో బిజెపికి బలం, ప్రజాధారణ పెరిగిందని నిరూపించుకోవాలంటే ఈ ఉపఎన్నికలలో తప్పనిసరిగా గెలిచితీరాలి. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో బిజెపి ఓడిపోతే అది రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఓటమిగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో బిజెపి విజయపరంపర మొదలైంది. అదీగాక బండి సంజయ్ నిత్యం సిఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. ఒకవేళ ఈ ఉపఎన్నికలలో బిజెపి ఓడిపోతే టిఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కనుక గెలిచి తీరాలి.
నిజానికి ఈ ఉపఎన్నికలు సిఎం కేసీఆర్, కె.జానారెడ్డి, బండి సంజయ్‌ల మద్య జరుగుతున్నవిగా భావించవచ్చు. కనుక నేడు జరిగే సాగర మధనంలో అమృత భాండం ఈ ముగ్గురిలో ఎవరికి దక్కుతుందో తెలియాలంటే మే 2వరకు ఎదురుచూడాల్సిందే.