ఒకప్పుడు తెలంగాణలో పర్యాటకం అంటే హైదరాబాద్, ఛార్మినార్, గోల్కొండ, సాలార్ జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్, వరంగల్ వేయి స్తంభాల గుడి, యాదగిరిగుట్ట, వేములవాడ, బాసర వంటి కొన్ని పేర్లు మాత్రమే ఎక్కువగా వినబడేవి. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం ప్రతీ జిల్లాను ఓ పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తోంది. అందుకు తాజా నిదర్శనంగా ఖమ్మం లకారాం చెరువు వద్ద అభివృద్ధి చెంసిన అందమైన పార్కు, చెరువు మద్యలో ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫౌంటెయిన్ గురించి చెప్పుకోవచ్చు.
రాష్ట్ర రవాణామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకొని లకారం చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయించారు. పార్కులో వాకింగ్ ట్రాక్, జిమ్ సెంటర్, రోప్ సైక్లింగ్ వంటివి ఏర్పాటు చేయిస్తున్నారు. మంత్రి పువ్వాడ అధికారులతో కలిసి బుదవారం లకారం చెరువులో మ్యూజికల్ ఫౌంటెయిన్‌కు ప్రారంభోత్సవం చేసారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహాయసహకారాలతోనే ఇదంతా సాధ్యమైంది. లకారం చెరువుపై రూ.8 కోట్లు వ్యయంతో ఓ కేబిల్ బ్రిడ్జి కూడా ఏర్పాటుచేస్తున్నాము,” అని చెప్పారు.