ఈనెల 17వ తేదీన నాగార్జునసాగర్ ఉపఎన్నికల పోలింగ్ జరుగనున్నందున నిబందనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందుగా అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం గడువు ముగిసిపోనుంది. గత నెలరోజులుగా మూడు ప్రధాన పార్టీల రోడ్డు షోలు, ర్యాలీలు, బహిరంగసభలతో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఆ హోరు తగ్గినా పార్టీల జోరు పెరుగనుంది.
ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన తరువాత ఆనవాయితీ ప్రకారం రాజకీయపార్టీలు, వాటి నేతలు, అభ్యర్ధులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తుంటారు. టిఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంచిపెడుతోందని కాంగ్రెస్ అభ్యర్ధి కె.జానారెడ్డి ఆరోపించారు. ఒకవేళ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినట్లయితే తాను ఘనవిజయం సాధించడం ఖాయమని అన్నారు. కె.జానారెడ్డి ఓటమి భయంతోనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఇప్పటివరకు చేసిన ఎన్నికల ప్రచారం ఒక ఎత్తైతే, ఈరోజు సాయంత్రం నుంచి ఎల్లుండి పోలింగ్ మొదలయ్యేలోగా సాగే ప్రలోభాల పర్వం మరో ఎత్తు. ఈ 48 గంటలలో ఏ పార్టీ ఓటర్లను తన వైపు తిప్పుకోగలిగితే దానికే విజయావకాశాలు మెరుగుపడతాయని అందరికీ తెలుసు.