ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతోంది. ఓ పక్క దేశంలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాపిస్తున్నా ఏ మాత్రం భయపడకుండా సుమారు 13.5 లక్షలకు పైగా భక్తులు, సాధువులు బుదవారం ఊరేగింపుగా బయలుదేరి వెళ్ళి గంగానదిలో స్నానాలు చేశారు. ఎవరూ మాస్కూలు పెట్టుకోలేదు. ఒకేసారి అంతమంది జనం తరలిరావడంతో భౌతికదూరం పాటించే అవకాశమే లేదు. కరోనా నేపధ్యంలో కుంభమేళాను రద్దు చేయాలని ఒత్తిళ్ళు వస్తున్నప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. కుంభమేళాను ముందుగా ముగించడంపై తనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రానందున యధాతధంగా నిర్వహిస్తామని హరిద్వార్ జిల్లా కలెక్టర్ దీపక్ రావత్ తెలిపారు.
నిన్న 13.5 లక్షలమంది కుంభమేళాలో స్నానాలాచరించారు. కుంభమేళా సాగుతున్న కొద్దీ ఈ సంఖ్య రోజురోజుకీ రెట్టింపు అవుతుంటుంది. కనుక ఈ కుంభమేళా ముగిసేసరికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా విస్పోటనం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. దానిని ఏవిదంగా ఎదుర్కోవాలో తెలీక అధికారులు తలలు పట్టుకొంటున్నారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రతీరోజూ లక్షల సంఖ్యలో భక్తులు ఈ కుంభమేళాకు వస్తుంటారు కనుక వారి ద్వారా అన్ని రాష్ట్రాలకు కరోనా మహమ్మారి వ్యాపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓ పక్క దేశంలో కొన్ని రాష్ట్రాలు జనతా కర్ఫ్యూలు, నైట్ కర్ఫ్యూలు విధిస్తూ కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి నానాపాట్లు పడుతుంటే, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కుంభమేళాకు అనుమతించి కరోనా వ్యాపింపజేస్తుండటం విస్మయం కలిగిస్తుంది. కుంభమేళాతో దేశంలో కరోనా విస్పోటనం జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?