తెలంగాణ రాజకీయాలలోకి హటాత్తుగా... చాలా నాటకీయంగా బలమైన కారణమేదీ చెప్పకుండా ప్రవేశించిన వైఎస్ షర్మిలకు టిఆర్ఎస్ సర్కార్ నుంచి బాగానే సహాయసహకారాలు లభిస్తుండటం విశేషం. రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపి, టిజేఎస్ పార్టీలు సభలు, దీక్షలు చేస్తామంటే వెంటనే ‘నో’ చెప్పేసే పోలీసులు ఇటీవల ఖమ్మంలో వైఎస్ షర్మిల సంకల్ప సభకు అనుమతించారు. రేపు ఇందిరా పార్క్ వద్ద ఆమె చేపట్టబోయే నిరాహారదీక్షకు అనుమతించారు. రాష్ట్రంలో ఆమె రాజకీయ ప్రస్థానానికి అధికార టిఆర్ఎస్ సహకరిస్తోందని చెప్పడానికి ఇవే తాజా నిదర్శనాలు.
ఖమ్మం సంకల్ప సభలోనే ఆమె రాష్ట్రంలో నిరుద్యోగసమస్య కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హైదరాబాద్‌లో మూడు రోజులు దీక్ష చేపడతానని ప్రకటించారు. కానీ పోలీసులు ఆమెకు ఒక్క రోజు దీక్షకు మాత్రమే అనుమతిచారు. దీంతో వైఎస్ షర్మిల రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరా పార్క్ వద్ద నిరాహారదీక్ష చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారు.
టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నిరుద్యోగసమస్యపై దీక్ష లేదా ర్యాలీ చేస్థానంటే ఉలిక్కిపడే ప్రభుత్వం, వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని నిలదీసేందుకు దీక్ష చేస్తానంటే అనుమతించడంలో పరమార్ధం ఏమిటో?