నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్‌ లౌక్యంగా సమాధానం

April 12, 2021


img

తెలంగాణ ఐ‌టి మంత్రి కేటీఆర్‌ ఆదివారం సాయంత్రం ట్విట్టర్‌లో #ఆస్క్ కేటీఆర్‌ వేదిక ద్వారా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు అందరినీ ఆకట్టుకొనేవిదంగా సమాధానాలు చెప్పారు. 

ఒక వ్యక్తి ‘కేరళ, పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుంది?’ అని ప్రశ్నించగా కేటీఆర్‌ ‘ప్రజాస్వామ్యం’ అని లౌక్యంగా సమాధానం చెప్పారు. కానీ ‘నాగార్జునసాగర్ ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది?’ అనే ప్రశ్నకు ‘టిఆర్ఎస్‌’ అని స్పష్టంగా సమాధానం చెప్పడం విశేషం. 

ఈసారి పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి తహతహలాడుతుంటే, మళ్ళీ గెలిచి అధికారాన్ని నిలుపుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆరాటపడుతోంది. ప్రస్తుతం ఆ రెండు పార్టీల మద్య తీవ్రస్థాయిలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. 

గతంలో సిఎం కేసీఆర్‌ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకొన్నప్పుడు ముందుగా పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కలిశారు. అటువంటి ప్రతిపాదన ఇంకా ఉన్నట్లయితే భవిష్యత్‌లో ఆమె సహాయసహకారాలు అవసరం ఉండవచ్చు. అలాగే రాష్ట్రానికి కేంద్రం సహాయ సహకారాలు అవసరం. కనుక ఇక ఈ ఎన్నికలలో ఎవరో ఒకరు గెలుస్తారనో, ఓడిపోతారనో కేటీఆర్‌జోస్యం చెపితే, అది టిఆర్ఎస్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే అక్కడ ప్రజాస్వామ్యం గెలుస్తుందని లౌక్యంగా సమాధానం చెప్పి తప్పించుకొన్నారు. కానీ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అలా చెపితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి కనుక అక్కడ టిఆర్ఎస్‌ గెలుస్తుందని ఖరాఖండీగా సమాధానం చెప్పారు. వాక్చాతుర్యం, తెలివితేటలు, లౌక్యం, రాజనీతిలో మంత్రి కేటీఆర్‌ తండ్రిని మించిన తనయుడు అనిపించుకొన్నారు.


Related Post