కరోనా ఇంత త్వరగా వ్యాపిస్తుందనుకోలేదు: ఈటల

April 12, 2021


img

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రాష్ట్రంలో సెకండ్ వేవ్ ఏఎవిదంగా ఉంది?’ అనే ప్రశ్నకు, “రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఇంత వేగంగా వ్యాపిస్తుందనుకోలేదు. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో కరోనా కేసులు పెరగడంతో ఆ రాష్ట్రాలకు తెలంగాణ మద్య నిత్యం రాకపోకలు సాగుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాపించిందని భావిస్తున్నాము. అయితే ఇప్పుడు కరోనా పట్ల అందరికీ పూర్తి అవగాహన ఉండటం, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు చాలా మంది ప్రజలు టీకాలు వేయించుకొంటుండటం వలన రాష్ట్రంలోకి కరోనా ఇంత వేగంగా వ్యాపించకపోవచ్చునని భావించాము. కానీ మేము ఊహించినదానికంటే వేగంగా కరోనా వైరస్‌ వ్యాపించింది. కనుక ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాము,” అని సమాధానం చెప్పారు. 

ఆర్టీపీసీఆర్ టెస్టుల గురించి మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్రమోడీ, హైకోర్టు చెప్పినట్లు రాష్ట్రంలో 70 శాతం ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయడం అసాధ్యం. ప్రస్తుతం రోజుకి 7,000 టెస్టులు చేస్తున్నాం. ఆ సంఖ్యను పెంచి 12,000 టెస్టులు వరకు చేయగలం. ప్రైవేటులో రోజుకి 21,000 టెస్టులు చేయగల సామర్ధ్యం ఉంది కానీ అనేక కారణాల వలన వారూ చేయలేకపోతున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తే దాని ఫలితం వచ్చేందుకు 48-72 గంటలు పడుతుంది. అంతవరకు చేతులు ముడుచుకొని కూర్చోంటే రోగుల ప్రాణాలకే ప్రమాదం. ఈలోగా రోగులను గుర్తించేలోగా వారి సంఖ్య కూడా పెరిగిపోతుంటుంది. అందుకే ర్యాపిడ్ టెస్ట్ చేసి వెంటనే తగిన చర్యలు చేపడుతున్నాం,” అని చెప్పారు.           

‘కరోనాను ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు చేపట్టారు?’ అనే ప్రశ్నకు మంత్రి ఈటల సమాధానం చెపుతూ, “ఇదివరకు కరోనా సోకినవారందరినీ ఆసుపత్రులలో చేర్చుకొని చికిత్స అందించేవారం. కానీ ఇప్పుడు సాధారణ లక్షణాలున్నవారందరూ ఇళ్ళలోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నాము కనుక ఆసుపత్రులపై భారం తగ్గింది. అయినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,000 పడకలు సిద్దంగా ఉన్నాయి. మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి సిద్దంగా ఉంచుకొన్నాం,” అని చెప్పారు.


Related Post