కరోనా మహమ్మారి గురించి రోజూ మీడియాలో వస్తున్న వార్తలను చూసి చూసి జనం కూడా విసుగెత్తిపోయుండవచ్చు. కానీ కరోనా గురించి చెప్పుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. భారత్‌లో గత 24 గంటలలో కొత్తగా 1.52 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకే రోజున 839 మంది కరోనాతో మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 11 లక్షలు దాటిపోయింది. గత ఏడాది భారత్‌లో కరోనా తీవ్రరూపం దాల్చినప్పుడు కూడా ఇన్ని కేసులు నమోదు కాలేదు కానీ ఈ ఏడాది కేవలం మూడు నెలల వ్యవదిలోనే కరోనా అదుపు తప్పి ఈ స్థాయికి చేరుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోంది.
ఆదివారం నమోదైన 1.52 లక్షల కేసుల్లో మహారాష్ట్రలో 55,411, ఛత్తీస్‌ఘడ్‌లో14,098, ఉత్తరప్రదేశ్‌లో 12,748, కర్ణాటకలో 10,250, తమిళనాడులో 6,618, కేరళలో 6,194 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో మహారాష్ట్రలో 309, ఛత్తీస్‌ఘడ్‌లో 123, ఉత్తరప్రదేశ్‌లో 46, కర్ణాటకలో 40, తమిళనాడులో 22, కేరళలో 17 మంది కరోనాతో చనిపోయారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ఏపీలో నిన్న 3,495 తెలంగాణ రాష్ట్రంలో 3,187 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నిన్న 9 మంది, తెలంగాణలో 7 మంది కరోనాతో చనిపోయారు.
తెలంగాణలో కరోనా తీవ్రత పెరిగిపోవడంతో ఇక నుంచి మళ్ళీ కటినంగా కరోనా ఆంక్షలు పాటించాలని నిర్ణయించింది. మాస్కు ధరించకుండా తిరిగితే రూ.1,000 జరిమానా విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.