కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఆయా రాష్ట్రాలలో కరోనా పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. కరోనా పాజిటివ్, యాక్టివ్ కేసులు, మరణాలు వగైరా గణాంకాల విషయంలో దాపరికం పాటించవద్దని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు తెలియజేస్తూ అందరినీ అప్రమత్తం చేస్తుండాలని సూచించారు. కరోనా విషయంలో ఏమాత్రం అలసత్వం చూపకుండా నియంత్రణకు గట్టిగా ప్రయత్నించాలని సూచించారు. రాజకీయ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దని ఆమె సూచించారు. ఈ సందర్భంగా ఆమె కేంద్రప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.
“దేశంలో కరోనాను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనందునే ఈ స్థాయిలో విరుచుకు పడుతోంది. మొదటిసారి చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించడం లేదు. మన అవసరాలకు సరిపడా వాక్సిన్లు ఉంటే విదేశాలకు సరఫరా చేసినా తప్పు కాదు కానీ దేశంలో లక్షలాదిమంది ప్రజలు కరోనా బారిన పడుతుంటే, కేంద్రప్రభుత్వం కరోనా వాక్సిన్లను విదేశాలకు సరఫరా చేస్తుండటం సరికాదు. తద్వారా దేశంలో వాక్సిన్ల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఇకనైనా దేశ అవసరాలకు సరిపడినన్ని వాక్సిన్లను అందుబాటులో ఉండేలా కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాను,” అని సోనియా గాంధీ అన్నారు.
భారత్‌లో గత ఏడాది కంటే ఈ ఏడాదిలో కరోనా శరవేగంగా వ్యాపిస్తోందని గణాంకాలే చెపుతున్నాయి. కరోనా నియంత్రణకు రెండు రకాల వ్యాక్సిన్లు, కరోనా చికిత్సకు మంచి మందులు, వైద్యులు, ఆసుపత్రులు అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ దేశంలో ఇంతగా కరోనా మహమ్మారి విజృంభించడానికి కారణాలు ఏమిటి? ప్రభుత్వం, వ్యవస్థల వైఫల్యమా... ప్రజల అలసత్వమా?అని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయో లేదో తెలీదు కానీ ఇదే వేగంతో దేశంలో కరోనా వ్యాపించినట్లయితే, దానిని ఇక అదుపుచేయలేని పరిస్థితి ఏర్పడితే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు ఎదుర్కొన్న దుస్థితే దాపురించే ప్రమాదం ఉంటుంది. కనుక ఇకనైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ పూర్తిస్థాయిలో కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మానుకొని కరోనా జాగ్రత్తలు పాటించడం మంచిది.