రాజన్న రాజ్యమంటే...కోర్టుల చుట్టూ తిరగడమే: బిజెపి

April 10, 2021


img

వైఎస్ షర్మిల శుక్రవారం ఖమ్మంలో సంకల్పసభలో మాట్లాడుతూ, కాంగ్రెస్‌, బిజెపి, టిఆర్ఎస్‌ మూడు పార్టీలపై తీవ్ర విమర్శలు చేసి, అవన్నీ విఫలమవడం వలననే తాను తెలంగాణ రాజకీయాలలోకి ప్రవేశించాల్సి వస్తోందని అన్నారు. రాజన్న రాజ్యం స్థాపించడమే తన లక్ష్యమని అన్నారు. 

వైఎస్ షర్మిల విమర్శలపై బిజెపి సీనియర్ నేత ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ స్పందిస్తూ, “రాజన్న రాజ్యం అంటే దోచుకొని దాచుకోవడమే అని ఎప్పుడో నిరూపించబడింది. వైఎస్ షర్మిల చెపుతున్న రాజన్న రాజ్యంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి వేలకోట్లు ప్రజాధనం దోచుకొన్నారు. ఆ కేసులలో నేటికీ వైఎస్ షర్మిల సోదరుడు, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డితో సహా పలువురు ఐఎఎస్, ఐపీఎస్‌ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అటువంటి రాజన్న రాజ్యం మాకు అక్కరలేదు. ఆమెకు కావాలనుకొంటే ఆమె అన్న పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లోనే స్థాపించుకోవచ్చు   కదా? ఇక్కడే ఎందుకు? అయినా కరోనా సమయంలో ఆమె భారీ బహిరంగ సభకు పోలీసులు ఎందువల్ల అనుమతించారు?” అని ప్రశ్నించారు. 

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు తదితరులు కూడా ఆమె విమర్శలు గట్టిగా తిప్పికొట్టారు. ఆమె ఏదో దురుదేశ్యంతోనే రాష్ట్ర రాజకీయాలలో వేలుపెడుతున్నారని గుత్తా అనుమానం వ్యక్తం చేశారు.


Related Post