సాగర్‌లో టిఆర్ఎస్‌కు విజయావకాశాలు..ఎందుకంటే..

April 10, 2021


img

ఈనెల 17వ తేదీన నాగార్జునసాగర్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుంది. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో టిఆర్ఎస్‌-బిజెపిల మద్య సాగిన పోటీ, ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌-కాంగ్రెస్ పార్టీల మద్యకు మారడం గమనిస్తే బిజెపి వెనుకబడిపోయినట్లు కనిపిస్తోంది. ఈ ఉపఎన్నిక రేసులో సీనియర్ కాంగ్రెస్‌ నేత కె.జానారెడ్డి బరిలో దిగినందునే పోటీ కాంగ్రెస్‌, టిఆర్ఎస్‌ల మద్యకు మారిందని చెప్పవచ్చు. అందుకే బిజెపి వెనుకబడిపోయిందని చెప్పవచ్చు. 

కనుక ఇప్పుడు టిఆర్ఎస్‌ అభ్యర్ధి నోముల భగత్ కుమార్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధి కె.జానారెడ్డిలలో ఎవరు గెలుస్తారని ఆలోచిస్తే, నోములకే ఆ అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనబడుతోంది. ఏవిదంగా అంటే...టిఆర్ఎస్‌ అభ్యర్ధీ గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి తాము ఏమేమి చేయగలమో టిఆర్ఎస్‌ నేతలు స్పష్టంగా చెప్పగలుగుతున్నారు. కానీ తనను గెలిపిస్తే ఏమి చేయగలరో కె.జానారెడ్డి చెప్పలేకపోతున్నారు. శాసనసభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెపుతున్నారు. 

ఇది ఉపఎన్నిక కనుక ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసేవారికంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేవారివైపే ప్రజలు మొగ్గు చూపుతారని వేరే చెప్పక్కరలేదు. ఒకవేళ కె.జానారెడ్డి కూడా నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినా ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించుకురాలేరు. కనుక టిఆర్ఎస్‌ అభ్యర్ధికే ఓట్లు వేసి గెలిపిస్తే ఆ కృతజ్ఞతతో నియోజకవర్గం అభివృద్ధి చేయడంతోపాటు తమ సమస్యలను కూడా పరిష్కరిస్తాడని ప్రజలు భావిస్తే నోముల భగత్ కుమార్‌ భారీ మెజార్టీతో విజయం సాధించే అవకాశాలున్నాయి. 


Related Post