కరోనా వ్యాప్తికి ఎవరు కారకులు?పార్టీలా...ప్రజలా?

April 10, 2021


img

తమిళనాడులో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి ఈ నెలాఖరువరకు పాక్షిక లాక్‌డౌన్‌ విధించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలోనే రోజుకి సుమారు 1,520 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 4,276 కేసులు, 19 కరోనా మరణాలు నమోదయ్యాయి. కనుక కరోనా కట్టడికి పాక్షిక లాక్‌డౌన్‌ విధించక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఓ పక్క రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తుంటే అధికార అన్నాడీఎంకె పార్టీతో సహా అన్ని పార్టీలు వేలాదిమందిని పోగేసి ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా గత రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీలు నిర్వహించాయి. శాసనసభ ఎన్నికలు జరిగిన కేరళ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, అస్సాం రాష్ట్రాలలోను, ఉపఎన్నికలు జరుగుతున్న తెలంగాణవంటి రాష్ట్రాలలోనూ ఇలాగే జరుగుతోంది. రాజకీయపార్టీల  నిర్లక్ష్యం కారణంగానే నేడు తమిళనాడుతో సహా ఆయా రాష్ట్రాలలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని చెప్పక తప్పదు. కానీ ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతుండటం వలననే కరోనా కేసులు పెరిగిపోయాయంటూ ప్రభుత్వాలు ప్రజలను నిందిస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post