అప్పుడు చెప్పిందేమిటి...ఇప్పుడు జరుగుతున్నదేమిటి?

April 08, 2021


img

అధికార టిఆర్ఎస్‌ ఎటువంటి బలమైన కారణం లేకుండానే 2018 డిసెంబర్‌లో ముందస్తు శాసనసభ ఎన్నికలకు వెళ్ళింది. లోక్‌సభ ఎన్నికలతో కలిసి శాసనసభ ఎన్నికలకు వెళితే టిఆర్ఎస్‌ రాజకీయంగా నష్టపోవచ్చును లేదా పార్టీపై ఒత్తిడి పెరుగుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళి ఉండవచ్చు. అది వేరే సంగతి. అప్పటి నుంచి రాష్ట్రంలో ఓ ఆరునెలల పాటు వరుసగా ఏవో ఓ ఎన్నికలు జరిగాయి. వరుస ఎన్నికలపై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, “నిజమే... రాష్ట్రంలో ఇంత సుదీర్గకాలంపాటు వరుసగా ఎన్నికలు జరుగుతుండటం అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. కానీ కాస్త ఓపికపట్టి వీటిని పూర్తిచేసుకొంటే మిగిలిన నాలుగున్నరేళ్ళు అందరం హాయిగా ఎవరి పని వారు చేసుకోవచ్చు. ఇక ఏ ఎన్నికలు ఉండవు కనుక ప్రభుత్వం కూడా పరిపాలనపై పూర్తిగా దృష్టిపెట్టి పనిచేసుకోగలుగుతుంది,” అని సర్ది చెప్పారు. 

కానీ అప్పటి నుంచి నేటి వరకు ఇంకా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఇంకా ముగియక మునుపే మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్దమవుతుండటంతో రాబోయే మరికొన్ని వారాల వరకు వరుసగా ఎన్నికలు జరుగనున్నాయి. అంటే సుమారు రెండున్నరేళ్ళుగా రాష్ట్రంలో ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయని స్పష్టం అవుతోంది. ఇందుకు టిఆర్ఎస్‌ను, ప్రభుత్వాన్ని తప్పు పట్టలేము కానీ ఈ ఎన్నికలన్నీ వరుసగా జరుగుతాయని తెలిసి ఉన్నప్పుడు ఆనాడు ఆవిదంగా ప్రజలకు చెప్పడం దేనికనేదే ప్రశ్న. 


Related Post