ఆ సోయి లేదేమిటో?

April 08, 2021


img

అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులపై ఇప్పటి వరకు ఎటువంటి ఆంక్షలు లేనప్పటికీ తెలంగాణతో సరిహద్దులు పంచుకొంటున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఆ రాష్ట్రాలకు బస్సులు నడిపించడం అంటే అక్కడి నుంచి కరోనా మహమ్మారిని వెంటబెట్టుకొని తెచ్చుకొన్నట్లే అవుతుంది. కరోనా భయంతోనే గత ఏడాది మార్చి నుంచి టీఎస్‌ఆర్టీసీ అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులను నిలిపివేసింది. మళ్ళీ డిసెంబర్‌-జనవరి నాటికి అన్ని రాష్ట్రాలలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ఎంపిక చేసిన రూట్లలో అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. కానీ మళ్ళీ ఇప్పుడు కరోనా తీవ్రత పెరగడంతో దానిని కట్టడి చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం పలుజిల్లాలో లాక్‌డౌన్‌ విధిస్తున్నప్పుడు, బోధన్ డిపో నుంచి మహారాష్ట్రకు బస్సులు ప్రారంభించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం నుంచి మహారాష్ట్రలో కరోనా ఎక్కువగా ఉన్న నాందేడ్, దెగ్లూర్‌ పట్టణాలకు రోజుకు 5 బస్సు సర్వీసులనుబోధన్ డిపో ప్రారంభించింది. 

బోధన్ డిపో మేనేజర్ రమణ స్పందిస్తూ, “అన్ని కరోనా జాగ్రత్తలు పాటిస్తూ నాందేడ్, దెగ్లూర్‌ పట్టణాలకు బస్సులను నడిపిస్తున్నాము,” అని చెప్పారు. కానీ బస్సులలో ఎన్ని జాగ్రత్తలు పాటించినా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం సాధ్యం కాదనే గత ఏడాది కాలంగా బస్సులను నిలిపివేశారు. ఒకవేళ కరోనా వ్యాపించకుండా ఇప్పుడు బస్సులు నడిపించడం సాధ్యమైతే మరి ఏడాదిగా బస్సులను ఎందుకు మూలపెట్టుకొని కూర్చోన్నట్లు?


Related Post