మహారాష్ట్ర ప్రభుత్వంపై జూ.అంబానీ విమర్శలు

April 07, 2021


img

మహారాష్ట్రలో మళ్ళీ కరోనా తీవ్రత పెరిగిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో లాక్‌డౌన్‌, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో వ్యాపారసంస్థలలో కరోనా ఆంక్షలు అమలుచేస్తుండటంపై ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పెద్ద కుమారుడు, రిలయన్స్ క్యాపిటల్ డైరెక్టర్ అన్మోల్ అంబానీ మహారాష్ట్ర ప్రభుత్వం తీరును తప్పు పడుతూ ఘాటుగా విమర్శలు చేశారు. 

“ప్రొఫెషనల్ నటులు తమ సినిమా షూటింగులలో పాల్గొనవచ్చు. ప్రొఫెషనల్ క్రికెటర్లు రాత్రివరకు క్రికెట్ మ్యాచ్‌లు ఆడుకోవచ్చు. ప్రొఫెషనల్ రాజకీయనాయకులు భారీ ర్యాలీలు నిర్వహించుకోవచ్చు. కానీ మా వ్యాపారాలు లేదా పని అవసరమైనవి కావా? అసలు అవసరమైనవి అనే దానికి నిర్వచనం ఏమిటి?ఎవరి పని వారికి అవసరమే కదా?” అని ట్వీట్స్ ద్వారా తన ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.    

అన్మోల్ అంబానీ ఆవేదన, ఆగ్రహంలో అర్ధముంది. కరోనాను నియంత్రించాలని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భావించడంలో తప్పులేదు. కానీ ఓ పక్క సినిమా షూటింగులు, సినీ ప్రదర్శలను, క్రికెట్ మ్యాచ్‌లకు, రాజకీయ నాయకుల ర్యాలీలను అనుమతిస్తూ, కోట్లాదిరూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేస్తున్నవారిపై మాత్రమే ఆంక్షలు విధించడం సరికాదనే చెప్పవచ్చు. 


ముఖ్యంగా దేశంలో కరోనా తీవ్రత పెరిగిందని తెలిసి ఉన్నప్పటికీ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాలలో ఉపఎన్నికలలో ప్రధాని నరేంద్రమోడీ మొదలు రాష్ట్ర స్థాయి మంత్రులు వరకు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నా ఎవరూ ప్రశ్నించడం లేదు. ఈ ఎన్నికలు ముగిసేసరికి దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? కేంద్రప్రభుత్వమా... రాష్ట్ర ప్రభుత్వాలా... ఆయా రాజకీయ పార్టీలా లేదా వైద్య ఆరోగ్యశాఖలా?


Related Post