ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా

April 07, 2021


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయినప్పటి నుండి ఏపీలో అభివృద్ధి కంటే రాజకీయాలే జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాజకీయ పరిస్థితులు మారినా రాజకీయాలు మాత్రం ఆగలేదు. గత ఏడాదిగా స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార వైసీపీ ప్రభుత్వానికి, టిడిపి, మాజీ ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ మద్య జోరుగా రాజకీయాలు, కోర్టు కేసులు నడిచిన తరువాత ఎట్టకేలకు ఆ ఎన్నికల తంతు ముగిసింది. నిమ్మగడ్డ పదవీ విరమణ చేయగానే ఆయన స్థానంలో ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నీలం సాహ్నీని నియమించుకొన్నారు. ఆమె అధ్వర్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సిద్దంకాగా, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు దాఖలవడంతో హైకోర్టు ఎన్నికలను నిలిపివేస్తూ నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఎన్నికలు కూడా వాయిదా పడింది. గత ఏడాది కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయిన ఈ ఎన్నికలు మళ్ళీ నిలిచిపోవడంతో అధికార వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన, అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల ప్రక్రియ నిలివేసే సమయానికి 660 జెడ్పీటీసీ స్థానాలలో 126 స్థానాలు, 10,047 ఎంపీటీసీ స్థానాలలో 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇప్పుడు జరుగబోతున్న ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి బహిష్కరించింది. ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికలలో అధికార వైసీపీ ఘనవిజయం సాధించింది. కనుక పరిస్థితులు అనుకూలంగా ఉన్న ఈ సమయంలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించి వాటినీ తన ఖాతాలో వేసుకోవాలనుకొన్న వైసీపీకి హైకోర్టు ఉత్తర్వులు పెద్ద షాక్ అనే చెప్పాలి. 


Related Post