అందరికీ కాదు...కొందరికే కరోనా టీకాలు: కేంద్రం

April 07, 2021


img

దేశంలో మళ్ళీ కరోనా తీవ్రరూపం దాల్చుతుండటంతో 18 ఏళ్ళపైబడి వయసున్నవారందరికీ కరోనా టీకాలు వేయాలని కోరుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాని నరేంద్రమోడీకి ఓ లేఖ వ్రాసింది. ఈ విజ్ఞప్తిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ స్పందిస్తూ కేంద్రప్రభుత్వం వైఖరిని స్పష్టం చేశారు. 

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “18ఏళ్ళు పైబడినవారందరికీ ఇప్పుడు కరోనా టీకాలు వేయడం సాధ్యపడదు. ముందుగా కరోనా సోకే ప్రమాదం ఉన్నవారికే టీకాలు వేస్తాం. అన్ని దేశాలలో ఇదే విదానం అవలంభిస్తున్నారు. ప్రజలకు కరోనా సోకకుండా నివారించడానికి, కరోనా మరణాలను తగ్గించడానికి ఇదే సరైన విదానమని నిరూపితమైంది. కనుక ప్రాధాన్యతా క్రమంలోనే ప్రజలకు టీకాలు ఇస్తాం,” అని చెప్పారు. 

ఇప్పటివరకు కరోనా సోకిన, కరోనా సోకి మరణించినవారిలో ఎక్కువగా 45 ఏళ్ళపైబడినవారే ఎక్కువగా ఉన్నారు. కనుక ముందుగా వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. యువతకు సహజంగానే రోగ నిరోదకశక్తి ఎక్కువగా ఉంటుంది కనుక వారికి కరోనా టీకాలు మరికొంత కాలం తరువాత ఇచ్చినా పర్వాలేదని నిపుణులు భావిస్తున్నారు. ఇక 0-12 ఏళ్ళ లోపు పిల్లలకు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుకనే పాఠశాలలు మూసివేసి వారిని ఇళ్ళకే పరిమితం చేస్తున్నారు. ఆ వయసు పిల్లలకు కరోనా టీకాలు వేయడం మంచిదా లేక ప్రమాదమా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. కనుక అది నిర్ధారణ అయ్యేవరకు పిల్లలకు కరోనా టీకాలు వేసే అవకాశం లేదనే భావించవచ్చు.


Related Post