టిఎస్‌పీఎస్సీ ద్వారా యూనివర్సిటీలలో ఖాళీలు భర్తీ?

April 06, 2021


img

తెలంగాణలోని 11 యూనివర్సిటీలలో కలిపి మొత్తం 1,061 అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. అయితే ఈసారి వాటిని ఆయా యూనివర్సిటీల ద్వారా కాకుండా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టిఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. టిఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ ఇచ్చి, రాత పరీక్షలు నిర్వహించి వాటిలో ఉత్తీర్ణులైనవారిని యూనివర్సిటీలే ఇంటర్వ్యూలు చేసుకొని వారిలో సమర్దులను ఎంపికచేసుకొనే అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి చిత్రారామచంద్రన్ దీని సాధ్యాసాధ్యాలపై నేడు ఉన్నతవిద్యామండలి, యూనివర్సిటీల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఒకవేళ ఈ ప్రతిపాదనలకు యూనివర్సిటీలు సమ్మతిస్తే ఈ ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తీసుకొని వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు 

రాష్ట్రంలో 11 యూనివర్సిటీలు 1,061 మంది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు లేకుండానే నడుస్తున్నాయంటే వాటిలో విద్యాబోధన ఎంత గొప్పగా ఉందో అర్దం చేసుకోవచ్చు. అధ్యాపకులు లేకపోయినా...పాఠాలు బోధించకపోయినా విద్యాసంవత్సరాలు ఆగవని అందరికీ తెలుసు. ఈ పరిస్థితులలో విద్యార్దులు యూనివర్సిటీలలో ఏమీ నేర్చుకోకుండానే బయటకు వస్తే వారు ఎలా రాణించగలరు? ఆ యూనివర్సిటీ ఇస్తున్న ఆ డిగ్రీలకు ఇక విలువేముంటుంది? కనుక ఇకనైనా యూనివర్సిటీలలో అన్ని పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేస్తే విద్యార్దులకు మేలు చేసినవారవుతారు.


Related Post