రొటీన్ డైలాగ్స్‌తో కాంగ్రెస్‌ పరిస్థితి మారుతుందా?

April 05, 2021


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం నాగార్జునసాగర్‌లో పార్టీ అభ్యర్ధి కె.జానారెడ్డి తరపున ఎన్నికల ప్రచారసభలో పాల్గొన్నారు. ప్రతీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టి గెలుస్తోందని ఆరోపించారు. ఈ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని కనుక కె.జానారెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉపఎన్నికలతోనే రాష్ట్రంలో టిఆర్ఎస్‌ పతనం మొదలవుతుందని, వచ్చే శాసనసభ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని అన్నారు. 

అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నుంచి బయటకువచ్చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పోరాటపటిమ కోల్పోయిందని, కేసీఆర్‌ను, టిఆర్ఎస్‌ను అది ఎదుర్కోలేదని భావించే తాను కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్‌ కోవర్టులు చాలామంది ఉన్నారని వారే ఆ పార్టీ పతనానికి కారకులని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్న మాటలపై కాంగ్రెస్‌ నేతలు ఎవరూ స్పందించకపోవడం అంగీకారంగా భావించవచ్చేమో?ఈ పరిస్థితులలో పార్టీ వాస్తవ పరిస్థితిని పట్టించుకోకుండా ఇటువంటి ఊకదంపుడు ప్రసంగాలు చేయడాన్ని ఏమనుకోవాలి? ప్రతీ ఎన్నికలలో వెనకబడిపోతున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఏమైనా మార్పు వస్తుందా?మునిగిపోతున్న కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవడానికి ఏమి చేయాలో ఆలోచించకుండా మాటిమాటికీ కేసీఆర్‌ను గద్దె దించుతామంటే ప్రజలు నవ్వుతారని గ్రహిస్తే మంచిది.


Related Post