రాష్ట్రంలో మళ్ళీ లాక్‌డౌన్‌ విధించం: ఈటల రాజేందర్‌

April 05, 2021


img

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదివారం ఈస్టర్ పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌, సనత్‌నగర్‌ వద్దగల బాప్టిస్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది కనుక మళ్ళీ లాక్‌డౌన్‌ విధించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దు. ఎట్టి పరిస్థితులలో కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ విధించబోము. ప్రస్తుతం కరోనా తీవ్రత మళ్ళీ పెరిగియందున ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కూలు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రపరుచుకోవడం వంటి అన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాగే 45 ఏళ్ళు పైబడిన వారందరికీ ఉచితంగా కరోనా టీకాలు వేస్తున్నందున అందరూ టీకాలు వేయించుకొని కరోనా నుంచి రక్షణ పొందాలి,” అని అన్నారు. 

గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడం ద్వారా కరోనాను చాలా తక్కువ సమయంలో సమర్ధంగా అదుపు చేయగలిగినప్పటికీ, లాక్‌డౌన్‌ కారణంగా లక్షలాదిమంది వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. అలాగే పరిశ్రమలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడటంతో ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయి ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. నేటికీ వ్యాపారసంస్థలు, పరిశ్రమలు ఆ దెబ్బ నుంచి కోలుకోలేకపోతున్నాయి. కనుక కరోనా తీవ్రత ఇంకా ఎంత పెరిగినప్పటికీ లాక్‌డౌన్‌ విధించడానికి అన్ని రాష్ట్రాలు వెనకాడుతున్నాయి. కనుక ఇప్పుడు ప్రజలే బాధ్యతగా, క్రమశిక్షణగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది లేకుంటే కరోనా కష్టాలు ఎప్పటికీ భరిస్తూ జీవించవలసిరావచ్చు. 


Related Post