నిరుద్యోగ సమస్యపై రాజకీయలేల?

April 04, 2021


img

ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూసి నిరాశతో సునీల్ నాయక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నాయి. కానీ సునీల్ మృతిపై ఇంతవరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్‌ నేతలు ఎవరూ స్పందించకపోవడం విస్మయం కలిగిస్తుంది. దీనిపై స్పందిస్తే బహుశః ఉపఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు తమను విమర్శించేందుకు మరింత అవకాశం కల్పించినట్లవుతుందనే ఆలోచనతోనే అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నారేమో కానీ దీనిని ప్రతిపక్షాలు ఉపఎన్నికలలో ఓ అస్త్రంగానే స్వీకరించినట్లు స్పష్టం అవుతోంది. అంటే ఉద్యోగాల భర్తీపై ప్రతిపక్షాల చిత్తశుద్దిని కూడా శంఖించవలసివస్తోంది. 

ప్రతిపక్షాలు వాదిస్తున్నట్లు 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లయితే వాటిని భర్తీ చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కనుక దీనిపై ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న మంత్రి కేటీఆర్‌ లేదా మరొకరు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే నిరుద్యోగభృతి హామీని ఎప్పటి నుంచి అమలుచేస్తారో కూడా నిర్ధిష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. 

కానీ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించడం సాధ్యమేనా?అంటే కాదనే చెప్పవచ్చు. ప్రభుత్వోద్యోగులు 4-5 లక్షలమంది ఉంటే ప్రైవేట్ కంపెనీలలో, సంస్థలలో కోట్లాదిమంది పనిచేస్తున్నారు. అంటే ప్రభుత్వం కంటే ప్రైవేట్ రంగంలోనే పదింతలు ఎక్కువ ఉద్యోగాలున్నాయని స్పష్టమవుతోంది. కనుక ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయకపోతే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోందనే ప్రతిపక్షాల వాదన అర్దరహితమవుతుంది. 

ప్రభుత్వోద్యోగాలు భర్తీ చేయకపోతే ఆయా శాఖలపై...వాటిలో పనిచేస్తున్న ఉద్యోగులపై భారం పెరుగుతుంది. కనుక సకాలంలో... సవ్యంగా పనులు జరుగకపోవచ్చు. దాని వలన అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవలసివస్తుంటుంది. కనుక విద్యా, వైద్య, విద్యుత్, పోలీస్, పరిపాలన తదితర శాఖలలో పనులు సవ్యంగా...సజావుగా జరగడానికి ఉద్యోగాలన్నీ భర్తీ చేసుకోవలసిన అవసరం ఉంది తప్ప కేవలం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కాదని చెప్పవచ్చు. 

అసలు ప్రభుత్వోద్యోగమే ఎందుకు?అంటే దానిలో ఉద్యోగ భద్రత, సకాలంలో జీతాలు అందుకోవడం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, పదవీ విరమణ తరువాత పెన్షన్ వగైరాల కోసమేనని అందరికీ తెలుసు. చాలా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలలో కూడా ఇవన్నీ దొరుకుతున్నాయిప్పుడు. మరి అటువంటప్పుడు యువత ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ఎందుకు?దేశంలో కోట్లాదిమంది జీవితాంతం ప్రైవేట్ సంస్థలలోనే పనిచేస్తున్నవారున్నారు. మరి వారందరూ నిరాశానిస్పృహలలో మునిగిపోవడం లేదు కదా?కనుక ఒకవేళ ప్రభుత్వోద్యోగాలపై మక్కువ ఉన్నట్లయితే, ముందుగా ఏదో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించుకొన్నాక అప్పుడు ప్రయత్నించుకోవడం మంచిది కదా? 

ఉద్యోగాలు, ఉపాది కల్పన, భర్తీ విషయంలో యువతకు మార్గదర్శనం చేయవలసిన ప్రభుత్వం, ప్రతిపక్షాలు సున్నితమైన ఈ అంశంపై రాజకీయాలు చేసుకొంటూ కాలక్షేపం చేస్తుండటమే ఈ అనర్ధాలన్నిటికీ మూలకారణమని చెప్పక తప్పదు. కనుక యువత రాజకీయ నాయకుల వాదోపవాదాలకు ప్రభావితం కాకుండా తమ ముందున్న అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవడం చాలా మంచిది.


Related Post