లాక్‌డౌన్‌ భయంతో వలస కార్మికులు సొంతూళ్ళకు?

April 03, 2021


img

గత ఏడాది హటాత్తుగా లాక్‌డౌన్‌ విధించడంతో అష్టకష్టాలు అనుభవించిన వలస కార్మికులకు మళ్ళీ అదే సమస్య ఎదురవుతుందనే భయంతో ఈసారి ముందుగానే సొంతూళ్ళకు వెళ్ళిపోతున్నారు. మహారాష్ట్రలో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ఇప్పటికే పలు జిల్లాలో తాత్కాలిక లాక్‌డౌన్‌లు, నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నారు. అయినా కరోనా తీవ్రత అంతకంతకూ పెరిగిపోతుండటంతో మళ్ళీ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించే సూచనలు కనిపిస్తుండటంతో వలస కార్మికులు సొంతూళ్ళకు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. గతంలో లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు, దుకాణాలు, వ్యాపారాలు అన్ని మూతపడటంతో వారు రోడ్డున పడ్డారు. కానీ ఈసారి వారు ముందుగా వెళ్ళిపోతుండటంతో వారిపైనే ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు, దుకాణాలు, వ్యాపారాలు దెబ్బ తింటున్నాయి. వారు వెళ్ళిపోతుండటంతో యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈసమస్య తీవ్రతను అర్ధం చేసుకొన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈసారి లాక్‌డౌన్‌ విధించబోమని పదేపదే చెపుతున్నాయి. అయితే ఇదివరకు లాక్‌డౌన్‌ విధించినప్పుడు ఆయా సంస్థలు, ప్రభుత్వం వలస కార్మికులకు ఆశ్రయం కల్పించి ఆదుకొని ఉండి ఉంటే వారికి ఇప్పుడు నమ్మకం కలిగి ఉండేది కానీ అప్పుడు రోడ్డునపడినా ఒక్క బాలీవుడ్ నటుడు సోనూసూద్ తప్ప మరెవరూ పట్టించుకోలేదు. కనుక ఇప్పుడు వారు ఎవరినీ విశ్వసించడం లేదు. అందుకు వారిని తప్పు పట్టలేము కూడా. హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిమంది వలస కార్మికులు పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కనుక ఇక్కడ కూడా వలస కార్మికులు బయలుదేరితే కష్టమే. కనుక ముందే జాగ్రత్త పడితే మంచిదేమో? 


Related Post