కాంట్రాక్ట్ కోచ్‌ల కష్టాలు ఎవరికెరుక?

April 03, 2021


img

రాష్ట్రంలో కాంట్రాక్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్నేళ్ళు పనిచేసినా ఉద్యోగ భద్రత ఉండదు. ఇక జీతాల పెంపు మాట దేవుడెరుగు సకాలంలో జీతాలు ఇస్తే అదే పదివేలనుకొంటారు. స్పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ తెలంగాణలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కోచ్‌ల పరిస్థితి కూడా అదే. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ నేడు వారందరూ ఎల్బీ స్టేడియంలో ధర్నా చేశారు. 

తెలంగాణ కాంట్రాక్ట్ కోచ్‌ల నాయకుడు రవి శంకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయని ఆశపడ్డాము కానీ మా జీవితాలలో ఎటువంటి మార్పు లేదు. గత రెండు మూడు దశాబ్ధాలుగా మేము కాంట్రాక్ట్ కోచ్‌లుగానే పనిచేస్తున్నా మాలో ఎవరినీ రెగ్యులరైజ్ చేయలేదు. కనీసం నెలనెలా జీతాలు ఇవ్వడంలేదు. ప్రభుత్వ పెద్దలను, ప్రజా ప్రతినిధులను, పై అధికారులను కలిసి ఎన్నిసార్లు మా కష్టాలు మొరపెట్టుకొన్నా మమ్మల్ని పట్టించుకొనే నాధుడే లేడు. మన రాష్ట్రానికి వన్నె తెచ్చే అనేకమంది క్రీడాకారులకు మేము శిక్షణ ఇస్తున్నాము. మిగిలిన ఉద్యోగాలు, వృత్తులలో మాదిరిగా మా ఈ కష్టం, కృషి నలుగురికీ తెలియకపోవచ్చు. కానీ రాష్ట్రానికి, దేశానికి మేము మంచి క్రీడాకారులను తయారుచేసి అందిస్తున్నాము. కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మా కష్టాన్ని, కన్నీళ్ళను గుర్తించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. మరి వీరి గోడు ప్రభుత్వం చెవిన పడుతుందా?పడినా పట్టించుకొంటుందా? చూడాలి.


Related Post