తెలంగాణ ఏర్పడిన ఆరున్నరేళ్ళ తరువాత హటాత్తుగా వచ్చిన వైఎస్
షర్మిళ, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏమీ బాగోలేదని, రాష్ట్రంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనుక ఈ
సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ‘తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే’ అని గట్టిగా చెపుతున్నారు. తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబునాయుడు వేలు పెడితే
ఒంటికాలిపై లేచే టిఆర్ఎస్ నేతలు షర్మిళ రాకను, తమ ప్రభుత్వం
ఆమె చేస్తున్న విమర్శలను పట్టించుకోకపోవడం ఆలోచింపజేస్తుంది. అది వేరే సంగతి.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చేందుకే షర్మిళ వచ్చారని
కాంగ్రెస్ నేతలు మొదట్లో గట్టిగా వాదించారు. ఇందిరా శోభన్ వంటి కొంతమంది కాంగ్రెస్
నేతలు షర్మిళ పంచనచేరి, మరికొంతమందిని ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు
చూస్తుంటే వారి అనుమానాలు, భయాలు నిజమేననిపిస్తుంది. ఇందిరా శోభన్
నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే షర్మిళ పార్టీ
పెట్టబోతున్నారు. రాష్ట్రంలో వివిద పార్టీలకు చెందిన చాలా మంది మాతో టచ్‌లో ఉన్నారు.
షర్మిళ అధికారికంగా పార్టీని ప్రకటించగానే దానిలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు,” అని అన్నారు.
ఇందిరా శోభన్ చెపుతున్న ఆ ‘సిద్దంగా ఉన్నవారు’ టిఆర్ఎస్‌లో ఉండే అవకాశం లేదు. రాష్ట్రంలో కొంచెం బలం పుంజుకొన్న బిజెపిని
విడిచిపెట్టి ఎవరూ షర్మిళ పార్టీలో చేరుతారనుకోలేము. కనుక భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతున్న
కాంగ్రెస్ పార్టీ నుంచే వలసలు ఉండవచ్చు. అయితే ఆ పార్టీలో కూడా అగ్రనేతలు ఎవరూ అటువంటి
ఆలోచన చేయరు కానీ ఇందిరా శోభన్ వంటి ద్వితీయశ్రేణి నాయకులు షర్మిళ పార్టీలో చేరే అవకాశం
ఉంది. కనుక షర్మిళ ఎందుకు వచ్చారో తెలియకపోయినా ఆమె రాకతో కాంగ్రెస్ పార్టీని నిలువునా
చీలే ప్రమాదం ఉందని అర్ధమవుతోంది.