తెలంగాణ ఏర్పడి ఏడేళ్ళు కావస్తున్నా ఉద్యోగం దొరకలేదనే నిరాశనిస్పృహలతో మహబూబాబాద్ జిల్లాలోని తేజావత్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ (25) అనే ఓ యువకుడు గత నెల 26న కాకతీయ యూనివర్సిటీలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. అప్పటి నుంచి హైదరాబాద్ నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతను ఈరోజు ఉదయం మరణించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
సునీల్ నాయక్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బిజెపి నేతలు, విద్యార్దులు గాంధీ ఆసుపత్రి వద్ద ఆందోళన చేస్తున్నారు. ‘నోటిఫికేషన్ విడుదల చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా తెలంగాణ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుండటం వలననే తాను ఆత్మహత్య చేసుకొంటున్నానని’ సునీల్ నాయక్ చెప్పి చనిపోవడంతో విద్యార్దులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి వ్యానులలో పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండటంతో వారు ఇంకా ఆవేశానికి లోనయ్యారు. ఓ పక్క బిజెపి కార్యకర్తలు, మరోపక్క విద్యార్దుల నినాదాలతో గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సునీల్ నాయక్ డిగ్రీ చేసిన తరువాత పోలీస్ ఉద్యోగం కోసం గత 5 ఏళ్లుగా సిద్దమవుతున్నాడు. 2016 రిక్రూట్మెంట్‌లో తృటిలో ఉద్యోగావకాశం కోల్పోయాడు. అప్పటి నుంచి హన్మకొండలో నయీమ్ నగర్‌లో ఓ గది అద్దెకు తీసుకొని మరింత పట్టుదలగా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న సునీల్ నాయక్, ఇటీవల ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసును 61 సం.లకు పెంచడంతో తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యాడు. ఇక ఉద్యోగ ప్రకటన రాదనే నిరాశతో గత నెల 26న కేయూ మైదానంలో ఓ సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదనను స్నేహితులతో పంచుకొని పురుగుల మందు త్రాగేసాడు. స్నేహితులు అతనిని ఆసుపత్రికి తరలించారు కానీ వైద్యులు సునీల్ నాయక్ ప్రాణాలను కాపాడలేకపోయారు. దీంతో ఎన్నో కలలుగన్న సునీల్ నాయక్ జీవితం అర్దాంతరంగా ముగిసిపోయింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్దులు డిమాండ్ చేస్తున్నారు.