రాష్ట్రంలో ఓ పక్క ఎండలు మండిపోతుంటే మరోపక్క కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరుగుతుండటంతో మూడు ప్రధాన పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఓ పక్క ఎండలు, వడగాడ్పులతో ఆపసోపాలు పడుతూనే రాజకీయ నాయకులు, వారి అనుచరులు ఎప్పుడు ఎక్కడ కరోనా అంటుకొంటుందోనని భయపడుతూనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈసారి మూడు పార్టీల మద్య గట్టి పోటీ ఉండటంతో ప్రచారంలో వెనకబడితే ఓటమి తప్పదనే భయంతో కరోనా భయాలను పక్కనపెట్టి ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా వందలమందిని వెంటబెట్టుకొని వస్తున్న నేతలు, అభ్యర్ధులు వస్తుండటంతో వారి నుంచి తమకు ఎక్కడ కరోనా అంటుకొంటుందోనని ప్రజలు కూడా వారిని చూసి భయపడే పరిస్థితి ఏర్పడింది.
ఇక మండే ఎండల కారణంగా ప్రచారంలో ఎవరూ మాస్కూలు ధరించలేకపోతున్నారు. ర్యాలీలలో భౌతికదూరం పాటించడం కూడా సాధ్యం కాదు. కనుక ఈ ఉపఎన్నికలు ముగిసేసరికి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఎంతమంది కరోనా బారినపడతారో కొత్తగా ఎన్ని కేసులు నమోదవుతాయో ఎవరూ ఊహించలేరు.