భారత్-పాక్ మద్య సంబంధాలు చెడి చాలా కాలమే అవుతోంది. ఏళ్ళు గడుస్తున్నా ఇరుదేశాల వైఖరిలో ఎటువంటి మార్పు రానందున ఆ దూరం అలాగే ఉండిపోయింది. కానీ ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం...భారత్‌తో స్నేహసంబంధాలు కోరుకొంటున్నట్లు ఓ లేఖ వ్రాసింది. ఆ తరువాత భారత్ నుంచి చక్కెర, గోధుమలు, పత్తి దిగుమతిపై విధించిన ఆంక్షలు సడలిస్తున్నామని ఆ దేశ ఆర్ధికమంత్రి హమ్మద్ అజహర్ ప్రకటించారు. రాబోయే రంజాన్ పండుగ సమయంలో పాక్ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు. ఒక దేశపు ఆర్ధికమంత్రి చేసిన ప్రకటనకు చాలా విలువ ఉంటుంది. కానీ పాకిస్థాన్‌లో కాదు. ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు పాక్ అంతర్గత వ్యవహారాలమంత్రి షేక్ రషీద్ అహ్మద్ నిన్న ప్రకటించారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి పునరుద్దరించేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అది జరగని పని కనుక భారత్ నుంచి పాకిస్థాన్‌కు దిగుమతులు కూడా జరగవని స్పష్టం అవుతోంది. పాకిస్థాన్‌తో వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. కనుక ఎవరూ ఆశ్చర్యపోరు. తమ ప్రజల అవసరాల కోసమే దిగుమతికి సిద్దపడిన పాక్ ప్రభుత్వం ఇప్పుడు వద్దనుకొంటే ఇబ్బందిపడేది ఎవరు? అయినా నా కోడి కూయకపోతే లోకానికి తెల్లారదని పాకిస్థాన్ అనుకొంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు?