కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. 2019వ సంవత్సరానికి గాను ఆయనకు ఈ అవార్డు ఇస్తోంది. ఇది చాలా గొప్ప విషయమే కానీ ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో తమిళ ప్రజల ఆరాధ్య దైవంగా కొలువబడుతున్న రజినీకాంత్‌కు ఈ అవార్డు ప్రకటించడమే వేరే ఆలోచనాలకు తావిస్తోంది.
నిజానికి ఈ ఎన్నికలతోనే రజినీకాంత్ కొత్త రాజకీయపార్టీతో ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొన్నప్పటికీ, ఆరోగ్యకారణాల చేత ఆ ఆలోచనను విరమించుకొన్నారు. కానీ అంతమాత్రన్న ఆయన మాటకు విలువలేదనుకోలేము. సింహం బోనులో ఉన్నా బయట ఉన్నా సింహమే. రజినీకాంత్ కూడా అంతే. కనుక ఆయన ఏ పార్టీ లేదా కూటమికి అనుకూలంగా ఒక్క ముక్క మాట్లాడినా ఆ కూటమికి ఎన్నికలలో భారీగా లబ్ది కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొంటున్న ఈ సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకొని, అధికార అన్నాడీఎంకె-బిజెపి కూటమికి ఆయన మద్దతు పొందాలనే ఆశతోనే కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ప్రకటించిందా?అనే సందేహం కలుగకమానదు. ఈ సందేహం నిజమో కాదో రాబోయే కొద్ది రోజులలో తేలిపోతుంది. ఒకవేళ రజనీకాంత్ అన్నాడీఎంకె-బిజెపి కూటమికి మద్దతు ప్రకటిస్తే కేంద్రప్రభుత్వం వ్యూహం ఫలించిందనుకోవచ్చు.