నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో బిజెపి టికెట్ తప్పక లభిస్తుందనే నమ్మకంతో ముందుగానే నామినేషన్ వేసి ఎన్నికల ప్రచారం చేసుకొంటున్న నివేదితా రెడ్డికి ఎన్నికల అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అభ్యర్ధుల నామినేషన్లను పరిశీలించిన తరువాత ఆమెతో సహా మొత్తం 17 మంది స్వతంత్ర అభ్యర్ధుల నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉపఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్ధులతో సహా మొత్తం 60 మంది అభ్యర్ధులు మిగిలారు.
బిజెపి టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నేత కడారి అంజయ్య నిన్న టిఆర్ఎస్‌లో చేరి బిజెపికి షాక్ ఇచ్చారు. నివేదితా రెడ్డిని నామినేషన్ ఉపసంహరించుకోవలసిందిగా బుజ్జగించవలసిన అవసరం లేకుండానే ఆమె నామినేషన్ తిరస్కరించబడటంతో ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవలసి వచ్చింది కనుక ఇది బిజెపికి ఊరట కలిగించే విషయమే అని భావించవచ్చు.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు: ఏప్రిల్ 3
పోలింగ్: ఏప్రిల్ 17 (ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు)
ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: మే 2