సాగర్ ఉపఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కె.జానారెడ్డి పార్టీ బలం కంటే సొంత బలం, పేరు ప్రతిష్టలు, నియోజకవర్గంలోని ప్రజలతో ఉన్న సంబందాలను నమ్ముకొనే బరిలో దిగారని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలు ఆయనకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవేళ ఈ ఎన్నికలలో గెలిస్తే ఆయన పరువు నిలుస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరువు కూడా నిలుస్తుంది. పార్టీ పరువు నిలబెట్టినందుకుగాను ఆయనకు పిసిసి అధ్యక్షుడిగా నియమించినా ఆశ్చర్యం లేదు. కానీ ఈ వయసులో కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకొని మోయడం కష్టం. ఒకవేళ జానారెడ్డి అందుకు సిద్దపడినా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం సాధించడం ఇంకా కష్టం కనుక ఆ భారం వద్దనుకొని మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీలో ఓ ఎమ్మెల్యేగా కొనసాగడం కూడా ఆయనకు చాలా ఇబ్బందికరమే.
సిఎం కేసీఆర్ చెప్పినట్లుగా ఒకవేళ ఈ ఉపఎన్నికలలో జానారెడ్డి ఓడిపోతే ఆయన రాజకీయాలలో నుంచి నిష్క్రమించవచ్చు. ఇది ఆయన గొప్ప రాజకీయ జీవితానికి అవమానకరమైన ముగింపు అవుతుంది. ఈ అసంతృప్తి ఆయన జీవితాంతం వేదిస్తుంది. ఈ ఉపఎన్నికలలో ఓడిపోయినా కూడా ఒకవేళ ఆయన రాజకీయాలలో కొనసాగినా మునుపటి గౌరవం ఆశించడం కష్టం. కనుక ఏవిదంగా చూసినా జానారెడ్డి కోరి కష్టాలు కొనితెచ్చుకొన్నట్లే భావించవచ్చు.