ఎకరానికి మూడెకరాలు...సీఆర్‌ వ్యాఖ్యలపై రియాక్షన్స్

March 31, 2021


img

ఇటీవల సిఎం కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ, “ఒకప్పుడు ఏపీలో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో రెండెకరాలు కొనే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు తెలంగాణ అంతటా త్రాగు, సాగునీటి సౌకర్యం ఏర్పడి వ్యవసాయ, రియల్ ఎస్టేట్ రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందడంతో తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకొంటే ఏపీలో మూడెకరాలు కొనే పరిస్థితి ఏర్పడింది,” అని అన్నారు. 

సిఎం కేసీఆర్‌ చేసిన ఈ వ్యాఖ్యలను ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తూ, “టిడిపి హయాంలో శరవేగంగా అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు ఈ దుస్థితి ఏర్పడటానికి కారణం ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి అసమర్ధ పాలనే కారణం,” అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

చంద్రబాబు విమర్శలపై ఏపీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ, “ఆనాడు కేసీఆర్‌ను చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలోకి తీసుకొని ఉండి ఉంటే కేసీఆర్‌ టీఎస్‌ఆర్టీసీ పార్టీని స్థాపించేవాడు కాదు...తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదు. కానీ చంద్రబాబు కారణంగానే ఇదంతా జరిగింది. ఏపీలో భూములు విలువ ఇంతగా పడిపోవడానికి ఆనాడు చంద్రబాబునాయుడు తీసుకొన్న తప్పుడు నిర్ణయాలే కారణం,” అని ఘాటుగా సమాధానం చెప్పారు. 

ఏపీ, తెలంగాణలు విడిపోయి సుమారు ఏడేళ్ళవుతోంది. ఇప్పుడు రెంటినీ చూస్తే తెలంగాణ అన్ని రంగాలలో దేశంలో నెంబర్ 1స్థానంలో ఉంటే, ఏపీ పనికిమాలిన రాజకీయాలకు నిలయంగామారి ఏ అభివృద్ధికి నోచుకోకుండా మిగిలిపోయింది. 

ఇదే విషయం తెలిపేందుకు సిఎం కేసీఆర్‌ ఎకరానికి మూడెకరాలని ఉదాహరణగా చెపితే, అసలు విషయం పక్కన పెట్టి మళ్ళీ దీనిపై కూడా టిడిపి, వైసీపీలు పరస్పరం బురదజల్లుకొంటూ కాలక్షేపం చేస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.


Related Post