నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్ధిగా స్వర్గీయ నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్ పేరును ఖరారు చేసి గత రెండు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు సిఎం కేసీఆర్ తెరదించారు. అయితే ఈ ఉపఎన్నికలలో పోటీ చేయాలని ఆశపడిన సీనియర్ నేతలు కోటిరెడ్డి, చిన్నప్పరెడ్డిలకు టికెట్ ఇవ్వకపోతే వారిని బిజెపి లాగేసుకొంటుందని తెలిసి ఉన్నప్పటికీ సిఎం కేసీఆర్ ధైర్యంగా నోముల భగత్ కుమార్ పేరును ఖరారు చేశారు.
టికెట్ దక్కని కోటిరెడ్డి, చిన్నప్పరెడ్డిలను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని నచ్చజెప్పి ఎమ్మెల్సీ పదవులకు హామీ ఇచ్చారు. తద్వారా టికెట్ ఆశించి భంగపడిన వారిరువురూ పార్టీ వీడకుండా కాపాడుకోవడమే కాకుండా బిజెపికి బలమైన అభ్యర్ధి లభించకుండా అడ్డుకోగలిగారు. వారిలో ఏ ఒక్కరూ బిజెపిలో చేరినా ఆ పార్టీకి వారిలో ఎవరు బిజెపి తరపున సాగర్ ఉపఎన్నికల బరిలో దిగినా టిఆర్ఎస్‌కు ఎదురీదవలసి వచ్చేది. చివరి నిమిషం వరకు పార్టీ అభ్యర్ధి పేరును ప్రకటించకుండా బిజెపి నేతలను అయోమయంలో ఉంచారు. టికెట్ దక్కని కోటిరెడ్డి, చిన్నప్పరెడ్డిలకే పార్టీ అభ్యర్ధి నోముల భగత్‌ను గెలిపించే బాధ్యతను అప్పగించారు. ఒకవేళ ఏ కారణం చేతైనా నోముల భగత్ ఓడిపోతే దానికి వారు కూడా బాధ్యులే అవుతారు కనుక వారిరువురూ అతనిని గెలిపించుకొనేందుకు గట్టిగా కృషి చేస్తారని వేరే చెప్పక్కరలేదు. ఇన్ని సమస్యలని సిఎం కేసీఆర్ అలవోకగా పరిష్కరించేశారు. నాయకత్వ లక్షణం అంటే ఇదే కదా?