ప్రతీ ఎన్నికలలో అభ్యర్ధుల కోసం దేవులాటలేనా?

March 30, 2021


img

సాధారణంగా ఏ ఎన్నికలలోనైనా అధికారపార్టీలలో అనేకమంది బలమైన అభ్యర్ధులు టికెట్లు ఆశిస్తుంటారు. టిఆర్ఎస్‌లో కూడా అంతే! ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలోకి దిగజారిపోయినప్పటికీ ప్రతీ ఎన్నికలలో ఆ పార్టీలో టికెట్ల కోసం గట్టి పోటీయే కొనసాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమేనని గొప్పగా చెప్పుకొంటున్న బిజెపి మాత్రం ప్రతీ ఎన్నికలకు ముందు ఇతర పార్టీలలో బలమైన నేతలు ఎవరైనా ఉన్నారా?అని దేవులాడుతూ వారిని పార్టీలోకి రప్పించి పోటీ చేయించాలని చూస్తుండటం విస్మయం కలిగిస్తుంది. సొంత పార్టీలో టిఆర్ఎస్‌ను ఢీకొని ఓడించగల బలమైన అభ్యర్ధులు లేకనే ఈవిధంగా చేస్తోందని స్పష్టం అవుతోంది. 

నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పోటీ చేయాలని భావించిన టిఆర్ఎస్‌ నేతలు కోటిరెడ్డి, చిన్నప్ప రెడ్డిల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూపులు చూసి వారు ఇక బిజెపిలోకి రారని నిర్ధారణ అయిన తరువాతే పార్టీలోని డాక్టర్ రవి కుమార్‌ను అభ్యర్ధిగా బిజెపి ప్రకటించింది. 

సొంత పార్టీలో ద్వితీయశ్రేణి నేతలు రాజకీయంగా బలపడేందుకు తోడ్పడుతుంటే ప్రతీ ఎన్నికలలో బిజెపికి బహుశః ఇటువంటి దుస్థితి కలిగి ఉండేది కాదేమో?లోక్‌సభ, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలలో బిజెపిలోని నేతలను గుర్తించి, వారికి అన్నివిదాల ప్రోత్సహించి, పార్టీ అధిష్టానం అండగా నిలబడటం వలననే సత్ఫలితాలు సాధించగలిగిందనే సంగతి అందరికీ తెలుసు. 

రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్నప్పుడు, ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీలో అభ్యర్ధులే లేకపోతే బిజెపి అధికారంలోకి ఎలా రాగలదు?బీజేపీ సిద్దాంతాలకు పూర్తి భిన్నమైన సిద్దాంతాలున్న ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా...బిజెపికి రాజకీయ శత్రువుగా భావిస్తున కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను తెచ్చుకొని బలపడాలనుకోవడం ఎంత వరకు సబబు?వారితో టిఆర్ఎస్‌ను ఢీకొనడం సాధ్యమేనా?అని రాష్ట్ర బిజెపి పెద్దలు ఆలోచిస్తే బాగుంటుంది.


Related Post