మూడు పార్టీలకు ఉపఎన్నికలు ప్రతిష్టాత్మకమే

March 30, 2021


img

నాగార్జునసాగర్ ఉపఎన్నికలు టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీ మూడింటికీ చాలా ప్రతిష్టాత్మకంగా మారాయని చెప్పవచ్చు. 

దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఎదురుదెబ్బలు తిన్న కారణంగా ఈ ఉపఎన్నికలలో గెలిచి తీరాలి లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయి. పైగా మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని కాంగ్రెస్‌ లేదా బిజెపిలకి కోల్పోయినట్లవుతుంది. దాంతో శాసనసభలో కాంగ్రెస్‌ లేదా బిజెపి బలం మళ్ళీ పెరుగుతుంది. అందుకే సిఎం కేసీఆర్‌ఈసారి అభ్యర్ధి ఎంపిక విషయంలో నోముల కుటుంబంతో పాటు ఇతరులను కూడా పరిశీలించారు. కానీ నోముల భగత్ కుమార్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిర్ధారించుకొని టికెట్ కేటాయించారు. 

దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను దెబ్బతీసి మంచి ఊపుమీదున్న బిజెపి ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ చేతిలో ఓడిపోయింది. ముఖ్యంగా తన సిట్టింగ్ ఎమ్మెల్సీ (రామచందర్ రావు) సీటును టిఆర్ఎస్‌కు కోల్పోయింది. కనుక ఈ ఉపఎన్నికలలో కూడా ఓడిపోతే ‘బిజెపి నేతలు వాపును చూసి బలుపు అనుకొంటూ మిడిసిపడుతున్నారనే’ టిఆర్ఎస్‌ వాదనలకు బలం చేకూరుతుంది. పైగా ప్రజలు టిఆర్ఎస్‌ వైపే ఉన్నారనే బలమైన సంకేతం వస్తుంది. ఈ ఉపఎన్నికలలో ఓడిపోతే బండి సంజయ్‌ నాయకత్వంపై కూడా పార్టీలో అపనమ్మకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ ఉపఎన్నికలలో బిజెపి అభ్యర్ధి డాక్టర్ రవి కుమార్‌ను ఎట్టి పరిస్థితులలో గెలిపించుకోవాలి.    

కాంగ్రెస్ పార్టీకి 2014 నుంచి జరుగుతున్న అన్ని ఎన్నికలలో వరుసగా ఓటములే తప్ప పెద్దగా విజయాలు సాధించింది లేదు. పైగా ఇప్పుడు బిజెపి పుంజుకొని దాని స్థానం ఆక్రమిస్తుండటంతో ప్రతీ ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతోంది. ఒకపుడు రెండో స్థానంలో ఉండే కాంగ్రెస్‌, ఇప్పుడు మూడు, నాలుగు స్థానాలలో వెనుకబడిపోయింది. అందుకే ఈ ఉపఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో గెలిచి తీరాలనే పట్టుదలతో కె.జానారెడ్డిని బలవంతంగా ఒప్పించి బరిలోకి దించింది. ఆయన కూడా పార్టీ కోసం అయిష్టంగానే పోటీ చేస్తున్నప్పటికీ ఈ ఉపఎన్నికలు ఆయన సీనియారిటీకి, పేరు  ప్రతిష్టలకు, ప్రజాధారణకు గీటురాయిగా మారాయి. కనుక ఆయనకు ఇవి చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపధ్యంలో ముగ్గురు అభ్యర్ధులలో ఎవరు గెలుస్తారో మే 2వ తేదీన ఫలితాలు వెలువడినప్పుడు తెలుస్తుంది.


Related Post