నోముల కుటుంబానికే టిఆర్ఎస్‌ టికెట్?

March 29, 2021


img

టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో ఖాళీ అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నికలు జరుగబోతున్నాయి. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. కనుక పలు సర్వేలు, తర్జనభర్జనల తరువాత స్వర్గీయ నోముల కుమారుడు నోముల భగత్‌కే టికెట్ కేటాయించి బరిలో దింపాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించినట్లు తాజా సమాచారం. నిన్న రాత్రి నోముల భగత్‌కు ఈ విషయం తెలియజేసి ఈరోజు హైదరాబాద్‌ రావలసిందిగా తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశించినట్లు సమాచారం. కనుక ఈరోజు సాయంత్రంలోగా నోముల భగత్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది. 

బిజెపి కూడా ఇంతవరకు అభ్యర్ధిని ఖరారు చేయనప్పటికీ ఆ పార్టీ సాగర్ ఇన్‌-ఛార్జ్ కంకణాల నివేదిత రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు సాయంత్రంలోగా బిజెపి కూడా తమ పార్టీ అభ్యర్ధి పెరూ ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సీనియర్ నాయకుడు కే.జానారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జానారెడ్డికి మద్దతు ఈయవలసిందిగా కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వామపక్షలకు ఓ లేఖ వ్రాసింది.  

నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇప్పటి వరకు మొత్తం  20 మంది అభ్యర్ధులు 23 సెట్ల నామినేషన్లు వేశారు. రేపు చివరి రోజు కనుక మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులతో పాటు మరికొంత మంది స్వతంత్ర్య అభ్యర్ధులు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.


Related Post