మల్లన్న రూటే సపరేటు

March 29, 2021


img

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టిపోటీనిచ్చిన స్వతంత్ర అభ్యర్ధి అభ్యర్ధి తీన్మార్ మల్లన్న తన రాజకీయ భవిష్య కార్యాచరణ గురించి నిన్న ప్రకటన చేశారు. మేడ్చల్ జిల్లాలోని కాచవానిసింగారంలో తన అనుచరులతో సమావేశమై భవిష్య కార్యాచరణ గురించి వివరించారు. “నేను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలలోకి వచ్చాను తప్ప పదవులు, అధికారం కోసం కాదు. కనుక నేను కొత్తగా పార్టీ పెట్టడంలేదు. ఏ పార్టీలోను చేరడంలేదు. నిత్యం ప్రజలలోనే ఉంటూ వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతుంటాను. నా ఈ ఆశయాలకు అనుగుణంగా నాతో కలిసి పనిచేయాలని వచ్చేవారందరినీ కలుపుకొని ముందుకు సాగుతాను. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ గడీల పాలన అంతమొందించడమే నా లక్ష్యం. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 6,000 కిమీ పాదయాత్ర మొదలుపెడతాను,” అని అన్నారు.

రాజకీయాలలో మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా ఏదో ఓ పార్టీలో ఉండాలి లేదా సొంతంగానైన ఓ పార్టీ కలిగి ఉండాలి. గతంలో జయప్రకాష్ నారాయణ్, తరువాత ప్రొఫెసర్ కోదండరాం వంటివారందరూ ముందు ఇలాగే ఆలోచించి తరువాత పార్టీలు పెట్టుకొన్నారు. కానీ వారు విజయవంతం కాలేకపోయారు అది వేరే సంగతి. కనుక ఓ ఎన్నికలలో సమర్ధంగా పోల్ మేనేజ్మెంట్ చేసి ఓట్లు రాబట్టుకోవచ్చు కానీ పార్టీ, నేతలు, కార్యకర్తలు, కార్యాలయం వంటివేవీ లేకుండా రాజకీయాలలో మనుగడసాగించడం కష్టమే. పార్టీ లేకుండా ఓ బృందంగా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టడం అసంభవమే. అయినా కాంగ్రెస్, బిజెపీల వంటిబలమైన జాతీయపార్టీలే టిఆర్ఎస్ ధాటిని తట్టుకోలేక అల్లాడిపోతుంటే, ఏ పార్టీ లేకుండా మల్లన్న ఒక్కడే ఏమి చేయగలడు? కనుక పాదయాత్ర ముగించిన తరువాత మల్లన్న పార్టీని స్థాపిస్తాడేమో?


Related Post