విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి

March 27, 2021


img

భారత్‌లో మళ్ళీ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా  కొత్తగా 62,258 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది మార్చి నెలలో దేశంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదు కావడానికి సుమారు 5-6 నెలల సమయం పట్టింది. కానీ ఈసారి కేవలం నెలరోజుల వ్యవదిలోనే 62,000 కేసులు నమోదవడం గమనిస్తే దేశంలో కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకొంటున్నవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉండేది. ఆ కారణంగా రికవరీ శాతం 98 శాతం వరకు చేరుకొంది. కానీ ఇప్పుడు అది 95.09 శాతానికి పడిపోయింది. గత 24 గంటలలో దేశవ్యాప్తంగా 30,386 మంది కరోనా నుంచి కోలుకోగా 291 మంది కరోనాతో మృతి చెందారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటలలో కొత్తగా 36,902 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 112 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అంటే దేశవ్యాప్తంగా నమోదైన కేసులు, మరణాల సంఖ్యలో సగం మహారాష్ట్రలోనే జరిగాయన్న మాట! 

కరోనాను కట్టడి చేసేందుకు మహారాష్ట్రలో ఇప్పటికే కొన్ని జిల్లాలలో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించగా, మిగిలిన ప్రాంతాలలో చాలా కటినంగా కరోనా ఆంక్షలను అమలుచేస్తున్నారు. 

దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా తీవ్రత పెరిగిపోయినందున ప్రజలందరూ పూర్తి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం లేకుంటే ప్రాణాలు పోవచ్చు...లేదా చికిత్స కోసం దాచుకొన్న సొమ్ము ఊడ్చుకుపోవచ్చు లేదా మరోసారి  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ భరించవలసి రావచ్చు.


Related Post