భట్టి విక్రమార్క సూచన బాగుంది కదా?

March 26, 2021


img

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈరోజు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి సలహా ఇచ్చారు. “రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితమే స్కూళ్ళు, కాలేజీలు తెరిచి విద్యార్దుల తల్లితండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేశారు. నెలరోజులు తిరక్క మునుపే ఇప్పుడు విద్యాసంస్థలన్నీ మూసివేయడంతో విద్యార్దులు, తల్లితండ్రులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. కనుక ముందుగా రాష్ట్రంలో విద్యార్దులందరికీ కరోనా టీకాలు రెండు డోసులు వేయించి, నెల రోజుల తరువాత విద్యాసంస్థలన్నీ తెరవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు. 

విద్యార్దులు (చిన్నపిల్లలకు) కరోనా టీకాలు వేయవచ్చో లేదో ఇంకా తెలీదు. కానీ ఒకవేళ వేయవచ్చనుకొంటే భట్టి విక్రమార్క సూచించినట్లుగా ముందుగా వారికీ, ఉపాధ్యాయులు, పాఠశాల, విద్యాశాఖ సిబ్బందికి టీకాలు వేసినట్లయితే విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది. సమాజహితం కోసం ఇది చాలా అవసరం కూడా. ఇప్పటికే కరోనా కారణంగా గత ఏడాది మొత్తం విద్యాసంస్థలను మూసుకోవలసి రావడంతో విద్యావ్యవస్థ తలక్రిందులైంది.

విద్యాసంస్థలు వీలైనంత త్వరగా తెరిచినట్లయితే విద్యార్దులు చదువులలో వెనుకబడిపోకుండా కాపాడుకోవచ్చు లేకుంటే విద్యార్దులు చదువులలో బాగా వెనుకబడిపోతారు. ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు తెరిచినట్లయితే వాటిలో పనిచేస్తున్న వేలాదిమంది అధ్యాపకుల జీవితాలు మళ్ళీ గాడినపడతాయి లేకుంటే మళ్ళీ వారందరూ రోడ్డున పడకతప్పదు.  రాష్ట్రంలో వేలాది ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. సుమారు ఏడాదిగా విద్యాసంస్థలు మూతపడటంతో ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీల యాజమానులు అద్దెలు, చివరికి కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఇక ఉపాద్యాయులకు నెలనెలా ఏవిదంగా జీతాలు చెల్లించగలరు?కనుక భట్టి విక్రమార్క సూచించినట్లుగా విద్యార్దులతో సహా విద్యావ్యవస్థతో సంబందం ఉన్న ప్రతీ ఒక్కరికీ తొలి ప్రాధాన్యతగా కరోనా టీకాలు ఇచ్చి విద్యావ్యవస్థను కాపాడుకోవడం మంచిది కదా?                   



Related Post