టీఎస్‌ఆర్టీసీ ఎప్పటికైనా కోలుకొంటుందా?

March 25, 2021


img

టీఎస్‌ఆర్టీసీ మొదటి నుంచి నష్టాలు, అప్పుల ఊబిలో మునిగితేలుతూనే ఉంది. 55 రోజులు సాగిన సమ్మె, ఆ తరువాత కరోనా, లాక్‌డౌన్‌ టీఎస్‌ఆర్టీసీని కోలుకోలేనంతగా దెబ్బ తీశాయి. ఇంకా తీస్తూనే ఉన్నాయి. సమ్మె తరువాత ఆర్టీసీని గాడిన పెట్టడానికి టీఎస్‌ఆర్టీసీలో లాభదాయకతలేని మార్గాలలో బస్సులను రద్దు చేసి, కొత్తగా కార్గో అండ్ పార్సిల్ సర్వీసులను ప్రారంభించింది. వాటితో టీఎస్‌ఆర్టీసీ పరిస్థితి ఏమాత్రం మెరుగపడకపోగా ఇంకా నష్టాలలో కూరుకుపోతోంది.

రాష్ట్ర ప్రభుత్వం రూ. 3,000 కోట్లు ఆర్ధికసాయం అందజేసిందని కానీ రూ.5,939 కోట్లు అప్పుల భారం కూడా ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ శాసనసభలో చెప్పారు. టీఎస్‌ఆర్టీసీలో సిటీబస్సులు, పల్లె ప్రగతి సర్వీసులు 35 శాతం నష్టాలతో నడుస్తున్నాయని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్టీసీ కార్మికుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు చెల్లించామని చెప్పారు.

ఈ పరిస్థితులలో కొత్తగా బస్సులు కొనుగోలు చేయడం, కొత్త బస్టాండ్లు నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కానీ ఎట్టి పరిస్థితులలో టీఎస్‌ఆర్టీసీని, దాని ఆస్తులను, దానిలో పనిచేస్తున్న ఉద్యోగులను కాపాడుకొంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ చెప్పారు. టీఎస్‌ఆర్టీసీని ఆదుకొనేందుకు ప్రజాప్రతినిధులు కూడా ముందుకు రావాలని, వారి నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించిన నిధులలో కొంత ఆర్టీసీ బస్టాండ్లలో మరమత్తులకు వినియోగించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. మంత్రి చెప్పినది వింటుంటే టీఎస్‌ఆర్టీసీ మళ్ళీ ఎప్పటికైనా కొలుకొంటుందా? అనే సందేహం కలుగకమానదు. 


Related Post