తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికర పరిణామం

March 25, 2021


img

ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలో తమిళనాడు రాజకీయాలలో ఆసక్తికర పరిణామం జరిగింది. ఇంతకాలం శశికళను పార్టీలోకి రానీయకూడదని, ఆమెతో చేతులు కలపకూడదని పట్టుదల ప్రదర్శించిన అధికార అన్నాడీఎంకె పార్టీ ఇప్పుడు ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తోంది. 

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిన్న చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాలలో కొన్నిసార్లు సర్దుబాట్లు తప్పవు. శశికళతో మాకు ఎటువంటి శతృత్వం లేదు. రాజకీయంగా విభేదించామంతే. ఒకవేళ ఆమె మళ్ళీ అన్నాడీఎంకె పార్టీలోకి రావాలనుకొంటే ఆమెను సాదరంగా ఆహ్వానిస్తాము. ఆమెతో పాటు టివివి దినకరన్ (ఆమె మేనల్లుడు)ని కూడా మాపార్టీలోకి ఆహ్వానిస్తున్నాము. కనుక అన్నాడీఎంకె పార్టీలోకి తిరిగిరావాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలి. ముఖ్యమంత్రి పళని స్వామితో నాకు ఎటువంటి విభేదాలు లేవు. ఈ ఎన్నికలలో కూడా ఆయనే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఉండాలని నేనే ప్రతిపాదించాను,” అని అన్నారు. 

ఈసారి తమిళనాడు శాసనసభ ఎన్నికలలో ప్రదాన ప్రతిపక్ష పార్టీ డీఎంకె గెలిచి అధికారంలోకి రాబోతోందని సర్వేలన్నీ చెపుతున్నాయి. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ ఈ ఎన్నికలలో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డిపోరాడుతున్నారు. ఇక కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మివేయాలనే నిర్ణయాల పట్ల తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కనుక బిజెపితో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్న అధికార అన్నాడీఎంకె పార్టీ పట్ల కూడా సహజంగానే ప్రజలలో వ్యతిరేకత నెలకొని ఉంది. కనుక ఈ ఎన్నికలలో అన్నాడీఎంకె పార్టీ ఓడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశః అందుకే చివరి ప్రయత్నంగా శశికళతో మళ్ళీ చేతులు కలిపేందుకు అన్నాడీఎంకె నేతలు సిద్దమైనట్లు భావించవచ్చు. మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడం కోసం అన్నాడీఎంకె నేతలు అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ళు జైలులో గడిపిన అవినీతిముద్ర పడిన శశికళతో చేతులు కలపడానికి వెనుకాడటం లేదని తమిళనాడు ప్రజలు భావిస్తే ఇదీ వారి ఓటమికి మరో కారణంగా మారవచ్చు. 


Related Post