మా ఒత్తిడి వల్లే పీఆర్సీ ప్రకటన: ప్రతిపక్షాలు

March 23, 2021


img

టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌, బిజెపిలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోయినందుకు చింతిస్తున్నాయో లేదో తెలీదు కానీ తమ ఒత్తిడి కారణంగానే సిఎం కేసీఆర్‌ వేతన సవరణ(పీఆర్సీ) ప్రకటించారని చెప్పుకొంటున్నాయి.

రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పీఆర్సీ కోసం మా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించారు. మా పోరాటలతో ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్‌ ఎక్కడ ఓడిపోతుందోననే భయంతో సిఎం కేసీఆర్‌ ఎన్నికలకు ముందు ఉద్యోగ సంఘాల నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకొని వారిద్వారా 29 శాతం పీఆర్సీ ఇవ్వబోతున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. కానీ గతంలో ఇచ్చినట్లు కనీసం 43 శాతమైన ఇవ్వకుండా 30 శాతం ప్రకటించడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పైగా పెంచిన జీతంలో గత 12 నెలలది మాత్రమే ఇస్తామని, మిగిలిన సొమ్మును రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో కలిపి ఇస్తామని మోసం చేశారు. ఉద్యోగాల భర్తీ చేయకూడదనే ఉద్దేశ్యంతోనే పదవీ విరమణ వయసును పెంచారు తప్ప వారిపై ప్రేమతో కాదు. కనుక తక్షణం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము,” అని హెచ్చరించారు.

కాంగ్రెస్‌, తెలంగాణ జనసమితి నేతలు కూడా ఇంచుమించు ఇలాగే అన్నారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి కూడా ఉందనేది నిజం. ప్రతిపక్షాలు ఈ ఎన్నికలలో పీఆర్సీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి అంశాలను ప్రధానాస్త్రాలుగా టిఆర్ఎస్‌ ప్రభుత్వంపైకి సందించాయి కనుకనే సిఎం కేసీఆర్‌ కూడా వాటిని ఎదుర్కొనేందుకు ధీటైన వ్యూహం అమలుచేసి విజయం సాధించారని చెప్పవచ్చు.

ఈరోజుల్లో ఏవిధంగా గెలిచారనే దానికంటే గెలుపే చాలా ముఖ్యం. అదే ప్రజాధారణకు ప్రామాణికం కనుక రాష్ట్రంలో టిఆర్ఎస్‌వైపే ప్రజలున్నారని భావించాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బిజెపిలు రెండూ ఓడిపోయాయి కనుక పీఆర్సీ, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి విషయంలో వాటి వాదనలను పట్టభద్రులు కూడా పట్టించుకోలేదని భావించాల్సి ఉంటుంది. కనుక కాంగ్రెస్‌, బిజెపిలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలోనే కాకుండా రాజకీయంగా కూడా సిఎం కేసీఆర్‌ చేతిలో ఓడిపోయాయనే చెప్పక తప్పదు. 


Related Post