పింఛన్లు...రేషన్ కార్డులు పరిష్కారాలు కావు: ఈటల

March 22, 2021


img

టిఆర్ఎస్‌ పార్టీలో... రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ గొంతులో మళ్ళీ అసంతృప్తి ప్రతిధ్వనించింది. కరీంనగర్‌ జిల్లా వీణవంకలో ఆదివారం రైతువేదిక సభలో మాట్లాడుతూ, “ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు…కానీ శాశ్వితంగా ఓడిపోవు. కులం, డబ్బు, పార్టీ, జెండాను కాదు మనిషిని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు మహాభారతంలో కౌరవుల చెడ్డతనం వలననే పాండవులకు అంతమంచి పేరు వచ్చింది. భారతంలో కౌరవులు, రామాయణంలో రావణాసురుడు  ఉన్నాడు. రాముడూ ఉన్నాడు. అటువంటివారు నేడు మన సమాజంలో ఉన్నారు. నాయకుడంటే అతని కులం, భారీ ఆకారం, ఒంటి నిండా బంగారు ఆభరణాలు కావు. ప్రజల కష్టాలకు స్పందించేవాడే అసలైన నాయకుడు...నిజమైన మనిషి. కళ్యాణలక్ష్మీ, పింఛన్లు, రేషన్ కార్డులు పేదరికానికి పరిష్కారం కావు. కనుక జనం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయగలిగితేనే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. నేను ఎటువంటివాడినో గత 20 ఏళ్లుగా మీ అందరూ చూస్తున్నారు. మీ ఆదరణ, ఆశీర్వచనాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. నేను చేయగలిగినంతా చేస్తున్నాను. అయితే చేసింది చెప్పుకోనవసరం లేదు. ప్రజలే గుర్తిస్తారు. గుండెల్లో పెట్టుకొని అదరిస్తుంటారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరికీ పెద్దదిక్కుగా ఉంటాను,” అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.

 మంత్రి ఈటల రాజేందర్‌ గొంతులో వినిపిస్తున్న ఈ అసహనమంతా జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతున్న మంత్రి గంగుల కమలాకర్‌ గురించేనా?గంగులకు ఈటల రాజేందర్‌కు పడటంలేదనేది బహిరంగ రహస్యం. కనుక దుర్యోధనుడు, రావణుడు అని గంగులను ఉద్దేశ్యించే ఆయన అన్నారా? సిఎం కేసీఆర్‌ గంగులకు ప్రాధాన్యం ఇస్తూ తనను పక్కన పెట్టారని ఈటల రాజేందర్‌ బాధపడుతున్నారా?రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ అమలుచేస్తున్న కళ్యాణలక్ష్మీ పధకం, పింఛన్ల వలన ఏ ప్రయోజనం లేదంటూ ఈటల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశ్యించి చేశారు? అది సిఎం కేసీఆర్‌పై మంత్రి ఈటల రాజేందర్‌లో నెలకొన్న అసంతృప్తికి, అసహనానికి సంకేతాలుగా భావించాలా? టిఆర్ఎస్‌ తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ లేదా పార్టీ నేతలే సమాధానం చెప్పాలి. 


Related Post