తుదిదశకు చేరుకొన్న కౌంటింగ్...రాములు నాయక్ అవుట్!

March 20, 2021


img

రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజు మద్యాహ్నం తుది దశకు చేరుకొంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 90 మంది అభ్యర్ధులను జాబితాలో నుంచి తొలగించి (ఎలిమినేట్) వారి బ్యాలెట్ పేపర్ల రెండో ప్రాదాన్యత ఓట్లను మిగిలిన ముగ్గురు అభ్యర్ధులకు కలుపుతున్నారు.

టిఆర్ఎస్‌ అభ్యర్ధి సురభి వాణీదేవికి 1,28,689 ఓట్లు, బిజెపి అభ్యర్ధి రామచందర్ రావుకి 1,19,198 ఓట్లు, ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 67,383 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం సురభి వాణీదేవి 8,812 ఓట్లు ఆదిక్యంలో ఉన్నారు. ఒకవేళ ఇంకా వారిలో ఎవరికీ 50 శాతం+1 ఓటు రాకుంటే, మూడో స్థానంలో ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎలిమినేట్ చేసి ఆయనకు పడిన రెండో ప్రాదాన్యత ఓట్లను వాణీదేవి, రాంచందర్ రావుల ఖాతాలో జమా చేసి చూస్తారు. 

వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో కూడా ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకొంది. ఇక్కడ కూడా 66 మంది అభ్యర్ధులను ఎలిమినేట్ చేసిన తరువాత కూడా ఫలితం రాకపోవడంతో మూడో స్థానంలో ఉన్న బిజెపి అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఆదిక్యతలో దూసుకుపోతున్న టిఆర్ఎస్‌ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డికి రెండో ప్రదాన్యత ఓట్ల లెక్కింపు తరువాత కొంచెం ఆదిక్యత తగ్గింది. ప్రస్తుతం ఆయన 25,528 ఓట్ల ఆదిక్యతలోనున్నారు.

రెండో ప్రాదాన్యత ఓట్లను కూడా కలిపిన తరువాత పల్లాకు 1,17,386 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధి తీన్మార్ మల్లన్నకు 91,858 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరాంకు 79,110 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూడా ఫలితం తెలకపోతే మూడో స్థానంలో నిలిచిన ప్రొఫెసర్ కోదండరాంను ఎలిమినేట్ చేసి ఆయనకు పడిన రెండో ప్రాదాన్యత ఓట్లను పల్లా, మల్లన్న ఖాతాలలో కలిపి లెక్క చూస్తారు. అప్పటికీ 50 శాతం+1 ఓటు రాకుంటే వారిద్దరిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు.


Related Post