కేసీఆర్‌ ఉండగా షర్మిళ అవసరం ఏమిటి? గంగుల

March 20, 2021


img

ఏప్రిల్ 9న వైఎస్ షర్మిళ ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించి కొత్త పార్టీని ప్రకటించబోతున్న వార్తలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో స్పందించారు. 

శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పధకాలు అమలవుతున్నాయి. కనుక ఆయన నాయకత్వంపై రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకముంది. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో కొత్త పార్టీ అవసరం లేదు. అవకాశం కూడా లేదు. షర్మిళ తాను తెలంగాణ కోడలిని కనుక రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశిస్తానంటూన్నారు. నిజమే కానీ తెలంగాణ ప్రజలందరికీ తండ్రి వంటి సిఎం కేసీఆర్‌ వారి బాగోగులు చూసుకొంటుండగా ఇక కోడలిపిల్ల అవసరం ఏమిటి? తెలంగాణ రాష్ట్రం పట్ల ఆమెకు నిజంగా అంత అభిమానమే ఉన్నట్లయితే రాష్ట్ర విభజనకు ముందు ఏపీలో కలిపేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అన్నతో మాట్లాడి తిరిగి వెనక్కు ఇప్పించాలి. తెలంగాణలో యాత్ర చేయాలనుకొంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర వాటాలోని కృష్ణా నదీ జలాలను తోడుకొనేందుకు ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్టు గురించి షర్మిళ మాట్లాడితే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడకుండా రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ వస్తే ఆమెను ఎవరూ నమ్మబోరు,” అని అన్నారు.          



Related Post