కరోనా ఇక ఎప్పటికీ ఉండబోతోందా?

March 20, 2021


img

భారత్‌తో సహా ప్రపంచదేశాలలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ విజృంభిస్తుండటంతో ప్రపంచంలో ఇక ఎప్పటికీ కరోనా నిలిచిపోతుందా?మానవులు దాంతో శాశ్వితంగా సహజీవనం చేయవలసిందేనా?అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

భారత్‌లో కట్టుదిట్టమైన చర్యలతో కరోనాను కట్టడి చేయగలిగారు. కానీ కాస్త అలసత్వం ప్రదర్శించగానే మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. అంటే కరోనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతుందని స్పష్టమవుతోంది. అయితే కరోనా భయంతో ఎల్లకాలం లాక్‌డౌన్‌ విధించుకొని, అన్నీ బంద్‌ చేసుకొని ఇళ్ళలో కూర్చోవడం సాధ్యం కాదు కనుక తప్పనిసరిగా ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేసుకోవలసి ఉంటుంది. 

ప్రస్తుతం కరోనాకు రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తుండటమే కాకుండా దేశవ్యాప్తంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ అది కూడా ఆశించినంత వేగంగా సాగకపోవడంతో కోట్లాదిమంది వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూపులు చూడవలసి వస్తోంది. పైగా వ్యాక్సిన్‌ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీడియాలో వస్తున్న వార్తలు ప్రజలలో అపోహలు, భయాలు కలుగజేస్తుండటంతో అనేకమంది వాక్సినేషన్‌కు దూరంగా ఉండిపోతున్నారు. కనుక కరోనా వ్యాక్సిన్‌ పట్ల ప్రజలలో నెలకొన్న భయాలు, అపోహలు తొలగించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టవలసి ఉంటుంది. లాక్‌డౌన్‌తో కలిగే ఆర్ధికనష్టం భరిస్తూ, కరోనా నివారణకు, కరోనా రోగుల చికిత్సకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు ఖర్చు పెట్టేబదులు వీలైనంత త్వరగా కరోనా వాక్సిన్ అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగితే అందరికీ ఉపశమనం లభిస్తుంది.

దేశంలో అన్ని రంగాలలోని అన్ని సంస్థలు, కార్యాలయాలు, పరిశ్రమలు, ప్రజలందరూ తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించేలా చేయడం చాలా అవసరం. కరోనా నివారణకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఇక ఎప్పటికీ కరోనాతో కలిసి జీవించాలని భావిస్తూ, కరోనా కట్టడి, నివారణకు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు శాస్విత ప్రాతిపదికన వ్యూహాలు, ఏర్పాట్లు అమలుచేయగలిగితే మంచిది. 


Related Post