పట్టభద్రులా...నిరక్షరాస్యులా? చెల్లని ఓట్లు 42,945

March 20, 2021


img

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాలలో కలిపి మొత్తం 42,945 ఓట్లు చెల్లకుండా పోయాయి. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో 21,309 ఓట్లు, వరంగల్‌-నల్గొండ-ఖమ్మం నియోజకవర్గంలో 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. సాధారణ ఎన్నికలలో నిరక్షరాస్యులు కూడా ఓటు హక్కు వినియోగించుకొంటారు కనుక అప్పుడప్పుడు ఈవిదంగా జరుగుతుంటుంది. కానీ ఉన్నతవిద్యావంతులైన పట్టభద్రులు మాత్రమే పాల్గొనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో వారు సైతం ఓట్లు వేయడంలో పొరపాట్లు చేయడం కొందరు అత్యుత్సాహం ప్రదర్శించి బ్యాలెట్ పేపర్లపై టిక్కులు, పేర్లు, నినాదాలు వ్రాయడం చాలా విస్మయం కలిగిస్తుంది.

కొందరు 1,2,3,4,5 అని సంఖ్యలలో ప్రాధాన్యత ఓట్లను వేసే బదులు అక్షరాలలో ఒకటి రెండు, మూడు అంటూ వ్రాయడంతో ఆ ఓట్లు చెల్లకుండా పోయాయి. కొందరు వరుసగా టిక్కులు పెట్టగా మరికొందరు తమకు నచ్చిన అభ్యర్ధులందరికీ 1 వేశారు. కొందరు బ్యాలెట్ పేపర్లలో జై కేసీఆర్‌... జై తెలంగాణ వంటి నినాదాలు కూడా వ్రాయడంతో ఆ ఓట్లన్నీ చెల్లకుండాపోయాయి. 

ఓపికగా క్యూలైన్లో నిలబడి చివరికి చెల్లని ఓట్లు వేశారు 42,945 మంది పట్టభద్రులు! ఈ ఎన్నికలలో ప్రాధాన్యత క్రమంలో ఏవిదంగా ఓట్లు వేయాలో ఓటర్లైన పట్టభద్రులకు పూర్తి అవగాహన కల్పించినప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ఓట్లు వేయడం చాలా బాధాకరమని టిఆర్ఎస్‌ అభ్యర్ధి, విద్యావేత్త సురభి వాణీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 


Related Post